- CJI మీద జరిగిన దాడి 30 కోట్ల దళితుల మీద జరిగిన దాడి.
- ధర్మం ముసుగులో, విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పుతాం.
- న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్ వివక్షతను పాటించాయి.
- రాజ్యాంగాన్ని తొలగించి , మను ధర్మాన్ని రుద్దాలని చూసే వారెవరైనా మాకు శత్రువులే.
- దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తాం.
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయి మీద జరిగిన దాడి.. దేశంలోని ముప్ఫై కోట్ల మంది దళిత ప్రజల మీద జరిగిన దాడే అని, దళితుల మీద దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించకపోవడం అత్యంత దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు ద్వజమెత్తారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయి మీద జరిగిన పాశవిక దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దళితుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెప్తుంటే అందుకు విరుద్ధంగా చట్టపరమైన వ్యవస్థలు దళితుల మీద దాడులకు పాల్పడుతున్న వారి మీద చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ధర్మం ముసుగులో విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించవా ? వారి మీద చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.దళితుల మీద దాడులకు పాల్పడితే చట్టాలు వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయ వ్యవస్థ, డిల్లి పోలీసు వ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్ తమ కర్తవ్యాలను అమలు చేయడంలో పూర్తి వివక్షతను చూపెట్టయని అన్నారు. ఎన్నో సంఘటనల మీద పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని సుమోటోగా కేసులు తీసుకున్న వ్యవస్థలు దేశంలోనే అత్యున్నతమైన సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టీస్ గా ఉన్న గవాయి మీద జరిగితే ఎందుకు మౌనం వహించాయి ? అని ప్రశ్నించారు.

ఘటన జరిగి నెల రోజులు గడిచినా కనీసం చట్టపరంగా ఒక చర్య కూడా ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు. ఇది వివక్షతను చూపుతున్న చర్య, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైన చర్య అని అన్నారు. దళితుల మీద దాడులకు పాల్పడితే సహించే రోజులు పోయాయని అన్నారు. ధర్మం ముసుగులో విశ్వాసాల ముసుగులో దాడులు పాల్పడే వారికి తగిన గుణపాఠం నేర్పుతామని అన్నారు. మా పోరాటం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, న్యాయవ్యవస్థ స్వతంత్రను కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికే జరుగుతుందని అన్నారు. రాజ్యాంగం ద్వారానే దళితులకు మానవ హక్కులు లభించి మనుష్యులుగా గుర్తించబడ్డారని అన్నారు.

దళితులు ఉన్నత స్థాయికి ఎదగడానికి రాజ్యాంగమే కారణం. ఇలా ఉన్నత స్థాయిలోకి ఎదగడకపోవడం కొంత మంది జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని తొలగించి మను ధర్మాన్ని ప్రజల మీద రుద్దాలని చేసే వారెవరైనా మాకు బద్ద శత్రువులే అని ప్రకటించారు. ప్రజాస్వామ్య స్థానంలో రాచరిక వ్యవస్థ తీసుకొచ్చే మను ధర్మాన్ని సహించేది లేదని అన్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం సమానత్వం కోసం రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


