ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై సీజేఐ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో తాత్సారం చేస్తున్నారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. ‘అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటారా? లేక కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా? అనేది స్పీకరే తేల్చుకోవాలి. వచ్చే వారంలోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవ డానికి సిద్ధంగా ఉండండి’అనిఅల్టిమేటం జారీ చేసింది. ఈ వ్యవహారంలో 4 వారా ల్లోగా సమాధానం ఇవ్వాలని స్పీకర్ కార్యాల యానికి నోటీసులు జారీ చేసింది.
కచ్చితంగా కోర్టు ధిక్కరణే.. రక్షణ ఉండదు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖ లు చేసిన పిటిషన్‌తో పాటు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన కోర్టు ధిక్క రణ పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. గతంలో జూలై 31న, మూడు నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.
అయితే ఆ గడువు ముగిసినా ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘అనర్హత పిటిషన్లను విచారించేటప్పుడు స్పీకర్ ఒక ‘ట్రిబ్యునల్’గా వ్యవహరిస్తారు. ఆ సమయంలో ఆయనకు ఎటువంటి రాజ్యాంగపరమైన మినహాయింపులు వర్తించవు. కోర్టు ఆదేశాలను పాటించకపోవడం స్పష్టంగా తీవ్రమైన ధిక్కరణ కిందకే వస్తుంది’అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారు?
విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్పీకర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ‘వచ్చే కొత్త సంవత్సరాన్ని ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే (స్పీకర్) నిర్ణయించుకోవాలి’అని హెచ్చరించారు. ‘తక్షణం దీనిని తేల్చండి.. లేదా మేమే ధిక్కరణ చర్యలు మొదలుపెడతాం’అని సీజేఐ స్పష్టం చేశారు. కాగా నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిషేక్ మను సింఘ్వీలు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
అంతేగాక తాము ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం లేదని, హైకోర్టు, సుప్రీంకోర్టు మధ్య పిటిషనర్ తిరుగుతుండటం వల్ల ఏర్పడిన న్యాయపరమైన సందిగ్ధత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వారు సమరి్థంచుకునే ప్రయత్నం చేశారు. అన్ని పిటిషన్లూ ఒకే దశలో లేవని, నాలుగు పిటిషన్ల విచారణ పూర్తయిందని, మూడు పిటిషన్లకు సంబంధించి సాక్ష్యాధారాల నమోదు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. రెండు పిటిషన్లను ఇంకా పరిశీలించలేదని అవి విచారణ దశలో ఉన్నాయని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వివరించారు.
నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి..
ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, సమాధానం చెప్పడానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతానికి స్పీకర్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ, తదుపరి విచారణ నాటికి కచ్చితమైన పురోగతి ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ధర్మాసనం సంకేతాలు ఇచ్చింది.


