సాక్షి, హైదరాబాద్: దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి(Kotha prabhakar reddy) బిగ్ షాక్ తగలింది. దుర్గం చెరువు అక్రమ ఆక్రమణపై హైడ్రా ఫిర్యాదుతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణపై దర్యాప్తు చేపట్టినట్టు మాదాపూర్ పోలీసులు తెలిపారు.
వివరాల మేరకు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు.. దుర్గం చెరువులో సుమారు ఐదు ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపేసినట్టు హైడ్రా(HYDRA) సూపర్‌వైజర్ కాంత్రి ఆనంద్, హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో, ఆక్రమణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండగా.. అక్రమంగా ఆక్రమించిన ఐదు ఎకరాల భూమిని ఎస్‌టీఎస్ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు పార్కింగ్‌కు వినియోగిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, ఈ భూమి వ్యవహారంలో 2014లో హెచ్‌ఎండీఏ ఎఫ్‌టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ నేతలు భూమి ఆక్రమించినట్టు ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. ఇలా ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం(రెంటుకు ఇవ్వడం) పొందుతున్నారని ఆరోపించారు. దీంతో, మాదాపూర్ పోలీసులు.. ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిపై BNS 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్-3 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.


