సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు కూడా అదే అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు డిమాండ్ చేశారు. సభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, సభ్యులందరికీ సమాన హక్కులే ఉంటాయన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ప్రభుత్వం తన వాదన చెబితే, మేం మా వాదన చెప్పుకుంటాం. అంతే తప్ప మేమేమీ అదనంగా అడగడం లేదు. గత పదేళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నాం’అని కేటీఆర్ చెప్పారు. 2016 మార్చి 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బాయ్‌కాట్ చేసిందని గుర్తు చేశారు. అప్పుడు దాన్ని పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిన కాంగ్రెస్, ఈరోజు అదే విధానాన్ని ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్‌కు లేఖ ఇచ్చామని, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు.
అవగాహన లేకుండా ఉపన్యాసాలా?
నదీ జలాలు, సాగునీటి వ్యవస్థపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి శాసనసభలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఆ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్న సీఎం నుంచి గోదావరి, కృష్ణా జలాలపై పాఠాలు వినాలా? అని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్‌లో ఉందో కూడా ఆయనకు తెలియదని విమర్శించారు. సుంకిశాల ప్రాజెక్ట్ కూలిపోయినా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ‘మేం మీ దగ్గర ఏం నేర్చుకోవాలి? చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేరి్పస్తారా? మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చామో వివరిస్తారా? వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో చూపిస్తారా? లేక కృష్ణా నదిపై తెలంగాణకు ఉన్న హక్కులన్నింటినీ కేఆర్‌ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో పవర్ పాయింట్‌లో చూపిస్తారా?’అని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పాలమూరును పక్కన పెట్టారు
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా పక్కన పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి తరచూ ‘పండబెట్టి తొక్కుతాం’అంటారని, ఇప్పుడు నిజంగానే ఆ ప్రాజెక్ట్‌ను పండుకోబెట్టి పాలమూరు రైతాంగాన్ని తొక్కుతున్నారని మండిపడ్డారు. ఏం చేశారని ప్రజల ముందుకు వెళ్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని నిజంగా గౌరవించే ప్రభుత్వం అయితే, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షానికి సమాన అవకాశాలు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో తిరోగమనమే..
కేలండర్లు మారుతున్నాయే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా తెలంగాణ అభివృద్ధి బాటలో కాకుండా తిరోగమనం వైపు సాగుతోందన్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నూతన సంవత్సర డైరీని కేటీఆర్ ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందున్న పరిస్థితులు తిరిగి వస్తున్నాయని చెప్పారు. పండుగ వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పారీ్టకి కార్యకర్తలే అసలైన బలమని, గులాబీ జెండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ అన్నారు.


