కల్వకుర్తి టౌన్/ఉయ్యాలవాడ: జీవిత భాగస్వాముల హఠాన్మరణం వారికి అంతులేని మనోవేదన కలిగించింది. జీవితంపై ఏర్పడిన విరక్తి బలవన్మరణానికి పురికొల్పింది. తాము మాత్రమే కన్నుమూస్తే కన్నబిడ్డలు అనాథలు అవుతారన్న భయం వారిని సైతం కడతేర్చేలా చేసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ గృహిణి ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రమాత్రలు కలిపిన కేక్ తినగా వారిలో తల్లీబిడ్డ మృతిచెందారు. మరోవైపు కొన్ని నెలల కిందట భార్య బలవన్మరణానికి పాల్పడటంతో తట్టుకోలేకపోయిన భర్త తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఉరేసుకొని కన్నుమూశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వేర్వేరు ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకల వేళ రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు స్థానికంగా తీరని వేదన మిగిల్చాయి.
భర్తలేని జీవితం వద్దనుకొని..
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని తిలక్‌నగర్ కాలనీకి చెందిన భీంశెట్టి ప్రకాశ్ (47)కు భార్య ప్రసన్న (38), 8వ తరగతి చదువుతున్న కూతురు మేఘన (13), 10వ తరగతి చదువుతున్న కుమారుడు అర్షిత్ రామ్ ఉన్నారు. స్థానికంగా బుక్ సెంటర్ నిర్వహించే ప్రకాశ్.. నవంబర్ 14న గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో అతడి భార్య ప్రసన్న తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. తల్లిదండ్రులు ధైర్యం చెబుతూ ఆమె వద్దే ఉంటున్నప్పటికీ భర్త లేని జీవితం తనకు వద్దని ప్రసన్న నిర్ణయించుకుంది. అదే సమయంలో తన పిల్లలు ఇతరులకు భారం కావొద్దని భావించింది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు స్థానికంగా ఉంటున్న కుమారుడి ఇంటికి వెళ్లడంతో చనిపోయేందుకు ఇదే సరైన సమయం అనుకుంది.
వెంటనే నిద్రమాత్రలను పొడి చేసి కూల్ కేక్‌లో కలిపింది. ఇంటి తలుపులు గడియపెట్టి టీవీ చూస్తున్న పిల్లలతో కలిసి కేక్ కట్ చేసింది. అనంతరం తల్లి, కూతురు కేక్ తిని అపస్మారక స్థితికి వెళ్లగా కొడుకు మాత్రం అనారోగ్యం కారణంగా సరిగ్గా తినలేదు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లలేదు. రోజూ మాదిరిగానే యోగక్షేమాలు తెలుసుకోవడానికి మధ్యాహ్న సమయంలో వచి్చన ప్రసన్న సోదరుడు చక్రి ఎంతసేపు తలుపు కొట్టినా ఎవరూ తీయలేదు. చివరకు గట్టిగా అరవడంతో అర్షిత్ రామ్ తేరుకొని తలుపు తీశాడు. వెంటనే ముగ్గురినీ 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే తల్లి, కూతురు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అర్షిత్ రామ్ చికిత్స పొందుతున్నాడు.
4 పేజీల సూసైడ్ నోట్..
ఆత్మహత్యకు ముందు ప్రసన్న పుస్తకంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. భర్త లేని జీవిత యుద్ధాన్ని చేయలేక చనిపోతున్నా. నేను చనిపోతే పిల్లలను ఎవరూ చూసుకోలేరని.. వారిని కూడా నాతో తీసుకెళ్తున్నా. నన్ను క్షమించండి. నా పెళ్లి చీర, పిల్లలకు ఇష్టమైన ఆకుపచ్చ దుస్తుల్లో దహన సంస్కారాలు నిర్వహించండి’అని ప్రసన్న రాసుకొచ్చింది. తమ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించవద్దని సూసైడ్ నోట్‌లో కోరింది.
ఐదు నెలల క్రితం చిన్నారుల తల్లి బలవన్మరణం
ఏపీలోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని తుడుమలదిన్నెకు చెందిన వేములపాటి సురేంద్ర (35), మహేశ్వరి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తీవ్ర అనారోగ్యం బాధతో గతేడాది ఆగస్టులో మహేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి పిల్లలు కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి (5), సూర్య గగన్ (1)తో కలిసి జీవిస్తున్న సురేంద్ర మానసికంగా కుంగిపోయాడు. బుధవారం రాత్రి ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై తానూ ఉరేసుకొని తనువు చాలించాడు. గురువారం ఉదయం 8 గంటలైనా ఇంటి తలుపులు తెరవకపోవడంతో సురేంద్ర తల్లి కృష్ణమ్మ వెళ్లి చూడగా కుమారుడు, మనవరాళ్లు, మనవడు విగత జీవులుగా కనిపించారు.


