న్యాయమూర్తిగా దేశానికి చేయగలిగినదంతా చేశాను
నాలుగు దశాబ్దాల ప్రస్థానం సంతోషాన్ని ఇచ్చింది
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ వెల్లడి
వీడ్కోలు పలికిన జడ్జీలు, లాయర్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రజలకు తన వంతు సేవలు అందించానని, పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేయబోతున్నానని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నాలుగు దశాబ్దాల ఈ ప్రస్థానం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. న్యాయరంగ విద్యారి్థగానే తన ప్రయాణానికి ము గింపు పలుకబోతున్నానని తెలిపారు. జస్టిస్ గవాయ్ ఈ నెల 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు.
శుక్రవారం చివరి పని దినం పూర్తిచేసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టులో సెర్మోనియల్ బెంచ్ నిర్వహించారు. జస్టిస్ గవాయ్‌తోపాటు బెంచ్ సభ్యులైన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్ గవాయ్‌కి ఘనంగా వీడ్కోలు పలికారు. పూర్తి సంతృప్తి, సంతోషంతో సుప్రీంకోర్టును వీడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి తాను చేయగలిగినదంతా చేశానని ఉద్ఘాటించారు.
పదవిని సేవగానే భావించాలి
ప్రతి న్యాయమూర్తి, ప్రతి న్యాయవాది, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ సూత్రాలకు లోబడి పనిచేయాలని జస్టిస్ గవాయ్ సూచించారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాన్ని భారత రాజ్యాంగం బోధిస్తోందని గుర్తుచేశారు. రాజ్యాంగానికి కట్టుబడి తన విధులను చిత్తశుద్ధితో నిర్వ ర్తించడానికి కృషి చేశానని పేర్కొన్నారు. 1985లో ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రవేశించానని, తద్వారా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టానని గుర్తుచేసుకున్నారు. ఈరోజు న్యాయరంగ విద్యార్థిగానే పదవీ విరమణ చేస్తున్నానని తెలిపారు.
రికార్డుకెక్కిన జస్టిస్ గవాయ్
జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఈ ఏడాది మే 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలలకుపైగా సేవలందించారు. రెండో దళిత సీజేఐగా, మొదటి బౌద్ధ మతస్తుడైన సీజేఐగా ఆయన రికార్డుకెక్కారు. వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్, అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ తదితరులు మాట్లాడారు. జస్టిస్ గవాయ్ మహోన్నతమైన సేవలందించారని కొనియాడారు.
ఒక సామాన్యుడు నిరంతర కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని నిరూపించారని ప్రశంసించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మరో వీడ్కోలు కార్యక్రమంలోనూ జస్టిస్ గవాయ్ పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల్లో(ఎస్సీ) క్రీమీలేయర్‌పై ఇచ్చిన తీర్పుతో సొంత సామాజికవర్గం నుంచి ఆగ్రహం ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో క్రీమీలేయర్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించకూడదని తాను ఇచ్చిన తీర్పు ఎస్సీలో చాలామందికి నచ్చలేదని అన్నారు.


