
భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ఆందోళన
ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులు, డీప్‌ఫేక్ వీడియోల వంటి సమస్యల ప్రస్తావన
వీటి నియంత్రణకు ప్రత్యేక చట్టాల రూపకల్పన అవశ్యమని ఉద్ఘాటన
విచారణా సంస్థలు, విధాన నిర్ణేతలకు ప్రత్యేక శిక్షణ అవసరమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: డిజిటల్ యుగంలో బాలికల భద్రత ప్రమాదంలో పడే పరిస్థితులు తలెత్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ శనివారం ఆందోళన వెలిబుచ్చారు. ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులు, డీప్‌ఫేక్ వీడియోలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం వంటి సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
వీటి నియంత్రణకు ప్రత్యేక చట్టాల రూపకల్పన అవశ్యమని ఉద్ఘాటించారు. అలాగే విచారణా సంస్థలు, విధాన నిర్ణేతలకు ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు. డిజిటల్ గవర్నెర్స్‌లో బాలికల రక్షణకు ప్రధాన ప్రాధాన్యత కల్పించాలని స్పష్టం చేశారు. యూనిసెఫ్ ఇండియాతో కలిసి జువెనైల్ జస్టిస్ కమిటీ (జేజేసీ) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో బాలిక రక్షణ– సురక్షిత, ప్రోత్సహక వాతావరణం’ అనే అంశంపై ఇక్కడ జాతీయ వార్షిక భాగస్వామ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో సీజేఐ చేసిన
ప్రసంగంలో ముఖ్యాంశాలు...
→ రాజ్యాంగపరమైన, చట్టపరమైన హామీలు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా అనేక మంది బాలికలు ఇప్పటికీ తమ మౌలిక హక్కులను, బతుకుదెరువు కోసం అవసరమైన ప్రాథమిక సదుపాయాలను దురదృష్టవశాత్తూ కోల్పోతున్నారు. ఈ బలహీన స్థితి వారిని లైంగిక వేధింపులు, దోపిడీలు, హానికరమైన ఆచారాల చక్రబంధంలోకి తోసేస్తోంది. పోషకాహార లోపం, లింగ ఆధారిత గర్భస్రావాలు, అక్రమ రవాణా, బాల్య వివాహాలు వంటి తీవ్రమైన సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు.
→ భద్రత అంటే కేవలం శరీరాన్ని రక్షించడం మాత్రమే కాదు. ఇది మరెన్నో అంశాలతో మిళితమై ఉంటుంది. గౌరవంగా తలెత్తి నిలబడగల సమాజాన్ని నిర్మించడం, అక్కడ ఆమె ఆశయాలు విద్యా సమానత్వంతో వికసించడం వంటి ఎన్నో అంశాలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. బాలికలకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా కొన్నిచోట్ల కొనసాగుతున్న పితృస్వామ్య ఆచారాలను మనం ఎదుర్కొనాలి.
→ రబీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘భయములేని మనసు ఉన్న చోట’ అనే కవితలోని భావమే బాలిక రక్షణ లక్ష్యంగా ముందుకు సాగాలి.
→ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అడ్డంకులు మహిళల జీవితాలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. కనుక వీటిపై లోతైన విశ్లేషణ అవసరం.
‘చైల్డ్ రైట్స్ అండ్ ది లా..’ పుస్తక పరిచయం
జువెనైల్ జస్టిస్ కమిటీ సభ్యులు న్యాయమూర్తి పార్దీవాలా ఈ సందర్భంగా ‘చైల్డ్ రైట్స్ అండ్ ది లా’ అనే హ్యాండ్‌బుక్‌ను కార్యక్రమంలో ప్రవేశపెట్టారు. ఈ పుస్తకం జేజేసీ మార్గదర్శకంలో సుప్రీంకోర్టు పరిశోధనా, ప్రణాళికా వ్యవహారాల విభాగం రూపొందించింది. జేజేసీ చైర్మన్ జస్టిస్ బి.వి. నాగరత్న, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి వ్యవహారాల మంత్రి అయునిసెఫ్–ఇండియా దేశ ప్రతినిధి సిథి్నయా మక్కాఫ్రే తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.