
వరకట్న వేధింపుల కేసుల విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ 498 (ఏ) కేసు దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా 2022లో అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థించింది. వరకట్న వేధింపుల కేసుల్లో భర్త లేదా అతడి కుటుంబ సభ్యులను తొందరపడి అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది.
దేశంలో ఇటీవలి కాలంలో వరకట్న వేధింపుల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం ఒకటైతే.. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్త, అత్తమామలు, ఇతర బంధువులపై 498 (ఏ) కేసులు వేయడమూ మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇవి తప్పుడు కేసులని న్యాయస్థానాల్లో తేలడం, పిటిషనర్లకు హెచ్చరికలు, జరిమానాలు విధించడమూ వినే ఉంటాం. దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం 498 (ఏ) దుర్వినియోగమవుతోందని, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది కూడా.
ఈ నేపథ్యంలో మంగళవారం చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ ఎ.జి.మసీహలతో కూడిన బెంచ్ కొన్ని కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం..
- ఎఫ్‌ఐఆర్ నమోదైన తరువాత కనీసం రెండు నెలలపాటు ఎలాంటి అరెస్ట్‌లు చేయకూడదు. ఈ సమయం వివాద పరిష్కారానికి అవకాశం కల్పిస్తుంది.
- ఎఫ్‌ఐఆర్ నమోదైన తరువాత ఫిర్యాదులను ముందుగా ప్రతి జిల్లాలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలకు రిఫర్ చేయాలి. ఈ కమిటీలో శిక్షణ పొందిన మధ్యవర్తులు, న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు లేదా వారి సహచరులు ఉండాలి.
- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ సభ్యులను సాక్షులుగా న్యాయస్థానాలు పిలవకూడదు.
- వివాద పరిష్కారానికి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలో జరిగే చర్చల్లో ఇరు పక్షాల వారు కనీసం నలుగురు బంధువులు (పెద్దవాళ్లు)లను భాగస్వాములుగా చేయాలి. ఆ తరువాత ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ తదుపరి చర్యల కోసం పోలీసులు, మేజిస్ట్రేట్లకు వివరణాత్మకమైన నివేదిక సమర్పించాలి. (ఇదంతా రెండు నెలల్లోపు పూర్తి కావాలి)
- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ చర్చలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడరాదు. అయితే సాధారణ విచారణను మాత్రం పోలీసులు కొనసాగించవచ్చు.
- కమిటీ సభ్యులకు, విచారణ అధికారులకు ప్రత్యేకమైన శిక్షణ కల్పించాలి.
- వివాదం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలోనే సమసిపోతే జిల్లా జడ్జీలు క్రిమినల్ కేసులను మూసివేయవచ్చు.
దుర్వినియోగం తగ్గుతుందా?
498(ఏ) దుర్వినియోగం తగ్గేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఏమాత్రం సంబంధం లేని కుటుంబ సభ్యులు తగిన పద్ధతి లేకుండానే అనవసరమైన వేధింపులకు గురవుతూంటారని, అలాంటి వాటిని ఈ మార్గదర్శకాల అమలుతో అరికట్టవచ్చునని వారు వివరిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సుప్రీంకోర్టు తాజా నిర్ణయానికి దారి తీసిన కేసులో భర్తతోపాటు అతడి తండ్రిని కూడా సుమారు వంద రోజులపాటు జైలు నిర్బంధం అనుభవించాల్సి వచ్చింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భార్య వేసిన కేసులో హత్యాయత్నం, మానభంగం వంటి ఆరోపణలూ చేయడంతో ఆ పరిస్థితి ఏర్పడింది.