
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో అత్యున్నత గౌరవాల్లో ఒకటైన అర్జున అవార్డులు విధానంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్పులు చేసింది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2025కి సవరించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. వీటి ఆధారంగా అర్హులైన క్రీడాకారులు అర్జున అవార్డు కోసం దరకాస్తు చేసుకునే అవకాశం కేంద్రం కల్పించింది.
అవార్డు లక్ష్యం
అర్జున అవార్డు లక్ష్యం కేవలం విజయాలను గుర్తించడం కోసం మాత్రమే కాదు, క్రీడాభివృద్ధికి కృషి చేసిన వారిని ప్రోత్సహించడం కోసం కూడా రూపొందించబడింది. ఇందులో భాగంగా రెండు విభాగాల అర్జున అవార్డులను కేంద్రం అర్హులైన క్రీడాకారులకు ఇచ్చేందుకు సిద్ధమైంది. వాటిలో ఈ రెండు విభాగాలు ఉన్నాయి.
1 అర్జున అవార్డు: గత నాలుగు సంవత్సరాల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు.
2 అర్జున అవార్డు (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్): క్రీడా జీవితానికి అనంతరం కూడా క్రీడల అభివృద్ధిలో సేవలందిస్తున్న మాజీ క్రీడాకారులకు.
అర్హత ప్రమాణాలు
క్రీడాకారులు ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ ఈవెంట్లలో విజయాలు సాధించి ఉండాలి. డోపింగ్ లేదా నైతిక ఉల్లంఘనలు జరగకూడదు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న క్రీడాకారులు తగిన సర్టిఫికేట్ సమర్పించాలి.
ఎంపిక ప్రక్రియ
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో మాజీ ఒలింపియన్లు, అర్జున అవార్డు గ్రహీతలు, క్రీడా జర్నలిస్టులు, నిపుణులు ఉంటారు. కమిటీ క్రీడాకారుల ప్రదర్శన, నాయకత్వం, క్రీడాస్ఫూర్తి వంటి అంశాల ఆధారంగా మార్కులు కేటాయించి తుది జాబితా సిద్ధం చేస్తుంది.
బహుమతి వివరాలు
ప్రతి విజేతకు ప్రభుత్వం నుండి రూ. 15 లక్షల నగదు బహుమతి,సర్టిఫికేట్,అర్జున అవార్డును అందిస్తారు, అవార్డులు ప్రతి సంవత్సరం ఆగస్టు 29న – హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినం సందర్భంగా అర్హులైన అభ‍్యర్థులకు రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.