‘మా నాన్న తర్వాతి సీఎం ఆయనే’.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య కుమారుడు | Siddaramaiah In Final Phase Of Political Career says Yathindra | Sakshi
Sakshi News home page

‘మా నాన్న తర్వాతి సీఎం ఆయనే’.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య కుమారుడు

Oct 22 2025 6:32 PM | Updated on Oct 22 2025 8:45 PM

Siddaramaiah In Final Phase Of Political Career says Yathindra

సాక్షి,బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య బాంబు పేల్చారు. మా నాన్న కెరీర్‌ ముగిసింది. ఇక కర్ణాటక కాంగ్రెస్‌ను ముందుండి నడిపించే శక్తిసామర్ధ్యాలు, ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఆ రాష్ట్ర  ప్రజా పనుల వ్యవహారాల శాఖ మంత్రి (పీడబ్ల్యూడీ) సతీష్ జార్కిహోళికే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

బెళగావి జిల్లాలోని రాయ్‌బాగ్ తాలూకా కప్పలగుడ్డి గ్రామంలో మహాకవి కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో యతీంద్ర సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా యతీంద్ర తన తండ్రి, సీఎం  సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘నా తండ్రి తన రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నారు. ఈ దశలో, ఆయనకు బలమైన భావజాలం, ప్రగతిశీల మనస్తత్వం కలిగిన నాయకుడు అవసరం. అలాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శకుడిగా ఉంటారు. ఆ నాయకుడే మంత్రి సతీష్ జార్కిహోళి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నిలబెట్టి, పార్టీని సమర్థవంతంగా నడిపించగల వ్యక్తి. అటువంటి సైద్ధాంతిక విశ్వాసం ఉన్న నాయకుడిని గుర్తించడం చాలా అరుదు’ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సతీష్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌లో వర్గపోరు బయటకొచ్చిన వేళ..
సిద్ధారామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతమైంది. పీడబ్యూటీ మంత్రిగా పని చేస్తున్న సతీష్‌ జార్కిహోళిని తదుపరి రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంటూ యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో  డీకే శివకుమార్‌తో ఉన్న విభేదాల్ని బహిర్గతం చేసింది.  కర్ణాటకలో సిద్ధారామయ్య వారసుడిగా డీకే శివకుమార్‌ పేరే ప్రధానంగా వినిపిస్తున్న తరుణంలో యతీంద్ర చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో హీట్‌ పుట్టించాయి. యతీంద్ర తన మనసులోని మాటను ఒక ప్రజావేదికపై బయటపెట్టడంతో డీకేతో ఉన్న విభేదాలు ఉన్నాయనే దానికి మరింత బలం చేకూర్చింది. 

గతంలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే క్రమంలో  డీకే శివకుమార్‌తో  ఒప్పందం కూడా జరిగింది. తలో  రెండున్నర ఏళ్లు చేయడానికి ఒప్పందం  కుదిరింది. ప్రస్తుతం సిద్ధరామయ్య రెండున్నరేళ్ల కాలం పూర్తి కావడానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో తదుపరి డీకేకే రాష్ట్ర కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించాలి.  ఈ విషయంపై ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ వద్ద పంచాయతీ కూడా జరిగింది.  మరి అటువంటిది  ఇప్పుడు డీకేను కాదని, మంత్రి సతీష్‌ను తెరపైకి తీసుకురావడంతో కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు బయటకొచ్చాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement