
‘సీఎం మార్పు’ అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఐదేళ్ల పదవీ కాలానికి తానే సీఎంగా ఉంటానని.. వచ్చే ఏడాది మైసూర్‌లో దసరాకీ తానే పూజ చేస్తానంటూ నొక్కి చెప్పారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలపై మాట్లాడుతూ.. "నేను రెండోసారి ముఖ్యమంత్రిని కాలేనని చాలామంది జోస్యం చెప్పారు, కానీ నేను అయ్యాను. నా కారుపై కాకి వాలడం దుశ్శకునం అని.. నేను సీఎం కొనసాగలేనని చాలామంది అన్నారు. నేను బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనన్నారు.. కానీ ఏం జరిగింది’’ అంటూ చెప్పుకొచ్చారు.
కాగా, గత కొంతకాలంగా కర్ణాటకలో ‘సీఎం మార్పు’పై గందరగోళం కొనసాగుతన్న సంగతి తెలిసిందే.. తాజాగా డిప్యూటీ సీఎం శివకుమార్ దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారాయన. ప్రపంచంలో ఏ మనిషైనా ఆశతోనే బతుకుతారని... ఆ ఆశే లేకుంటే జీవితమే లేదు. మీరడిగిన ప్రశ్నకు నేను కాదు.. కేవలం కాలమే దీనికి సమాధానం చెబుతుంది అని అన్నారాయన. సీఎం పదవి నిర్ణయం పార్టీ హై కమాండ్‌దేనని డీకే మరోసారి కుండబద్ధలు కొట్టారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 మే 20న అధికారంలోకి వచ్చింది. ఈ నవంబర్‌కు రెండున్నర సంవత్సరాలు పూర్తవుతాయి. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది.