
గుల్బర్గా: ‘అలంద్’లో ఓట్ల తొలగింపు ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలంద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6,018 ఓట్లను తొలగించారంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలో కర్ణాటక సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది.
గురువారం (సెప్టెంబర్ 18) ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో మీడియాతో మాట్లాడిన రాహుల్.. కర్ణాటకలోని కాంగ్రెస్‌కు బలం ఉన్న పోలింగ్ బూత్‌లను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అక్కడే ఓట్లను తొలగించేందుకు కుట్రలు సాగించారన్నారు. ‘‘ఓట్లు అత్యధికంగా తొలగింపునకు గురైన టాప్–10 బూత్‌లు కాంగ్రెస్‌కు బలం ఉన్నవే. 2018లో ఈ పదింటిలో ఎనిమిది బూత్‌లను కాంగ్రెస్ గెలుచుకుంది. మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ సాయంతో 6,850 మంది ఓటర్లను మోసపూరితంగా చేర్చారు. ఇదే సాఫ్ట్‌వేర్‌ను హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనూ ఉపయోగించారు. దానిపై మావద్ద ఆధారాలున్నాయి’’ అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల దొంగలకు యథేచ్ఛగా సహకరిస్తోందని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను కాపాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల చోరీపై తాను బయటపెట్టిన నిజాలు హైడ్రోజన్ బాంబు కాదని రాహుల్ వెల్లడించారు. త్వరలో నిజాలు బయటపెడతానని, బాంబు పేలుస్తానని అన్నారు.