ఈ బుకాయింపు ఆత్మవంచన కాదా? | KSR Comment on Speaker Gaddam Prasad Kumar Defection MLAs | Sakshi
Sakshi News home page

ఈ బుకాయింపు ఆత్మవంచన కాదా?

Dec 20 2025 12:06 PM | Updated on Dec 20 2025 1:50 PM

KSR Comment on Speaker Gaddam Prasad Kumar Defection MLAs

గజం మిథ్య ,పలాయనం మిథ్య అని  అంటారు. అందరూ శ్రీవైష్ణవులే.. రొయ్యల బుట్ట మాయం అని మరో సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేలకు సంబంధించి శాసనసభాపతి గడ్డం ప్రసాదకుమార్ ఇచ్చిన తీర్పును గమనిస్తే ఈ సామెతలు గుర్తుకు వస్తాయి. గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పవర్ వైపు నడిచే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి మళ్లారు. వారిలో పలువురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పీ మరీ ఆహ్వానించారు.  ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకున్నారు. అందరికి తెలిసిన ఈ సత్యం స్పీకర్‌కు తెలియకపోవడమే ఒక  ప్రత్యేకత . ఆయనకు మాత్రం వీరు పార్టీ మారిన ఆధారాలు కనిపించలేదు. వారిపై అనర్హత వేటు అవసరం లేదని నిర్ణయించారు. 

ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరైన దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పక్షాన లోక్ సభ ఎన్నికలలో పోటీచేశారు. ఆయన స్పీకర్ ఇచ్చిన నోటీసుకు ఇంతవరకు స్పందించలేదు. బహుశా మరికొంతకాలం ఈ విచారణ తంతు సాగుతుందేమో తెలియదు. లేదా మరీ ఓపెన్ అయిపోయినందున కొద్ది కాలం తర్వాత ఆయన రాజీనామా చేస్తారా?లేక తప్పనిస్థితిలో అనర్హత వేటు వేస్తారా?అన్నది  చూడాలి. మరో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించుకుని ఆ పార్టీ తరపున ప్రచారం చేశారన్నది బహిరంగ రహస్యం. మాజీ స్పీకర్ పొచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత ఏకంగా ప్రభుత్వ సలహాదారు అయ్యారు. ఈయన విషయంలో ఇంకా నిర్ణయం రాలేదు. తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,గూడెం మహీపాల్ రెడ్డి అరికపూడి గాంధీలకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయనవసరం లేదని స్పీకర్ తీర్పు ఇచ్చారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు  యాదయ్య,సంజయ్ కుమార్ లపై  కూడా నిర్ణయం రావల్సి ఉంది. దానం నాగేందర్ తప్ప మిగిలిన ఎమ్ఎల్యేలంతా తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని వాదించారు. 

ఈ పదిమంది ఎ మ్మెల్యేలపై అనర్హత వేటు   వేయాలని భారత రాష్ట్ర సమితి గత ఏడాదిన్నరగా పోరాడుతోంది. స్పీకర్  నిర్ణయం తీసుకోవడం లేదంటూ,జాప్యం చేస్తున్నారని హైకోర్టు ,సుప్రింకోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి సుప్రింకోర్టు మూడు నెలలలో దీనిపై తేల్చాలని స్పీకర్  ను ఆదేశించడంతో ఈ నిర్ణయం అయినా వెలువడింది. న్యాయ వ్యవస్త ఈ మాత్రం అయినా పట్టించుకోకపోతే ,ఈ తంతగం ఐదేళ్లపాటు సాగుతుండేది.ఇలా జరగడం మొదటిసారి కాదన్నది వాస్తవమే. బీఆర్ఎస్ కు ఈ విషయంలో అర్హత లేదన్న కాంగ్రెస్ వాదనను తోసిపుచ్చలేం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ తో సహా వివిధ విపక్షాల ఎమ్మెల్యేలు 38 మందిని  బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పట్లో ఆయన కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కండువాలు కప్పారు. ప్రస్తుత సి.ఎమ్. రేవంత్ కూడా అదే పనిచేశారు.  విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో  ఫిరాయింపులకు వ్యతిరేకంగా రేవంత్ తదితరులు న్యాయ పోరాటం చేశారు.కాని అది కొలిక్కి రాకుండానే ఎన్నికలు వచ్చే  శాయి.  ఒక చిన్న తేడా ఉంది. 

అదేమిటంటే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని,ఇతర పక్షాలను బీఆర్ఎస్   విలీనం చేసినట్లు అప్పటి  స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ విడత విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి  39 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా ఇద్దరు అనారోగ్యంతో మరణించారు.మిగిలినవారిలో  పది మందే పార్టీ మారారు. అందువల్ల విలీన ప్రకటనకు అవకాశం లేకుండా పోయింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెలకు ఐదువేల చొప్పున  శాసనసభ పక్షానికి విరాళం ఇస్తుంటే దానిని ఆ  పార్టీ  అంగీకరించిందని,అందువల్ల వారు బీఆర్ఎస్ వారే అనే చిత్రమైన కొత్త లాజిక్ ను రేవంత్ తీసుకువచ్చారు.  దేశ వ్యాప్తంగా ఈ ఫిరాయింపులన్నవి ఒక సమస్యగా మారింది. బీజేపీ కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో  అధికారంలోకి రావడానికి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వచ్చేలా చేసింది.అదే టైమ్ లో రాజ్యసభలో టీడీపీ ఎమ్‌.పిలు నలుగురిని  బీజేపీలో విలీనం చేసుకుంది. ఇది కూడా అనైతికమే అయినా అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందుకు ఆమోదం తెలిపారు.

 సీనియర్ నేత, దివంగత శరద్ యాదవ్ ఒక సభలో వేరే పార్టీ సమావేశంలో పాల్గొన్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఆయనపై అతి వేగంగా  వెంకయ్య అనర్హత వేటు వేశారు. ప్రభుత్వపక్షం నుంచి ఎవరైనా పార్టీ మారితే మాత్రం అధ్యక్ష స్థానంలో ఉన్నారు అలా స్పందిస్తారన్నమాట. ప్రతిపక్షం నుంచి  ప్రభుత్వ పక్షంలోకి వస్తే ఇలాంటి విచారణలు,తీర్పులు వస్తుంటాయని అనుకోవాలి.  వైఎస్సార్‌సీపీ ఎమ్.పి  రఘురామకీష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓంబిర్లాను పదే,పదే కోరినా, కమిటీల విచారణ పేరుతో కాలయాపన చేశారేకాని అనర్హత వేటు వేయలేదని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తుంటుంది.ఏపీలో చంద్రబాబు నాయుడు గత టరమ్ లో వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మేల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా న లుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎవరిపై చర్య తీసుకోలేదు. కెసిఆర్ కూడా తొలి టరమ్ లో తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీలో ఉండగానే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అయినా వీరిలో ఎవరికి ఏమీ కాలేదు. ఇలా ఫిరాయింపులను  ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. 

ప్రజలకు నీతి వచనాలు చెప్పవలసిన ప్రజాప్రతినిధులు తామే అబద్దాలు చెబుతూ చట్టవిరుద్దంగా వ్యవహరిస్తూ అప్రతిష్టపాలు అవడానికి సిద్దపడుతున్నారు తప్ప రాజీనామా చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజివ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఫిరాయింపుల నిరోదక చట్టం వచ్చింది.ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు ఆయన కుమారుడైన లోక్ సభలో  ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ తదితరులకు కూడా తెలుసు.అయినా వారు కూడా దీనిని ఆపడం లేదు.దాంతో కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు కోల్పోతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకే పనిచేస్తున్నారని,తీర్పు రాజ్యాంగానికి అనుగుణంగా లేదని బిజెపి,బీఆర్ఎస్ లు విమర్శించాయి. కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది తప్ప నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. మన దేశంలో స్పీకర్లు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండడం లేదు.ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో అయ్యదేవర కాళేశ్వరరావు, బివి సుబ్బారెడ్డి,జి.నారాయణరావు వంటి గట్టి స్పీకర్ లు ఉండేవారు.అవసరమైతే వారు ముఖ్యమంత్రులుగా ఉన్నవారికి కూడా ఆదేశాలు ఇవ్వడానికి వెనుకాడేవారు. చాలావరకు స్వతంత్రంగా నిర్ణయాలు చేసేవారు.కాని ఆ తర్వాత కాలంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది.

గతంలో కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన కేసులో వారిపై అనర్హత వేటు వేశారు. కాకపోతే విచారణ పేరుతో ఆలస్యం చేశారన్న విమర్శ ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లో నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు  వైఎస్సార్‌సీపీలో చేరిన ఎమ్మెల్యేలపై సకాలంలో  అనర్హత వేటు వేయకుండా ఉప ఎన్నికలు రాకుండా చేశారన్న విమర్శ ఉంది. ఇలా స్పీకర్లు ఆయా పరిస్థితులను బట్టి,పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రులుగా ఉన్నవారి  నిర్ణయాలను బట్టి వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఈ విషయాలలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు మినహాయింపు ఇవ్వాలి. ఆయన కాంగ్రెస్ ను వీడి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్న తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేసి మళ్లీ గెలిచారు. అలాగే తన పార్టీలోకి రాదలచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారే తప్ప, అనైతికంగా వ్యవహరించలేదు. 

ఇప్పుడు ఆ సంప్రదాయం పాటించేవారు అరుదుగానే ఉంటున్నారని చెప్పాలి. ఈ ఫిరాయింపులకు పరిష్కారం వెదకవలసి ఉంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణ రాగానే మూడు నెలలు లేదా ఆరు నెలల్లో నిర్ణయం తీసుకునేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. లేదా ఎన్నికల కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకునేలా అధికారం ఇవ్వాలన్న సూచన ఉన్నప్పటికీ, అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే వింటోందన్న విమర్శలు ఉన్నాయి.ఏది ఏమైనా ఈ ఫిరాయింపుల సమస్యవల్ల మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలలో పలచన అవుతున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే తన అనర్హత పిటిషన్ ను కొట్టివేశాక ఒక వ్యాఖ్య చేశారు. పాలకు,పాలు, నీళ్ళకు నీళ్లు మాదిరి  తేలిందని అన్నారు. కాని వాస్తవం వేరు.  పాలల్లో నీళ్లు కలిశాయన్నది వాస్తవం. కండువా కప్పించుకున్నారన్నది బహిరంగ రహస్యం. దానిని ఈ  ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయించడం అంటే అది ఆత్మవంచన కాకుండా మరేమవుతుంది?
 


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement