తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతల సృష్టిస్తున్న అరాచకంపై మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. పాలకులే గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం’ అని టీడీపీ నేతలు మాట్లాడటం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన విడదల రజిని.. ‘మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం అని ఎమ్మెల్యే మాధవి బెదిరిస్తున్నారు. ఆమెను టీడీపీ బలిపశువు చేస్తోందని గుర్తుంచుకుంటే మంచిది. మహిళా పక్షపాతి లాగ తెగ బిల్డప్‌లు ఇస్తారు.. మళ్లీ మీరే దాడులు చేస్తారు.
కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారు. లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు. మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు. మాపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తే.. కనీసం స్పందన లేదు. కూటమి పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గుడికెళ్లి మొక్కుకుంటే తప్పా. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కదా. వైఎస్సార్‌సీపీ వాళ్లు ఏ గుడికి వెళ్లొద్దని చట్టం చేయండి.
తిరుమల లడ్డూ వ్యవహారంలో జరగని కల్తీని జరిగినట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. మేము కూటమి నేతలను నిలదీస్తున్నామనే మాపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. రాష్ట్రంలో రాజ్యాంగం లేదు.. ప్రజాస్వామ్యం లేదు.. శాంతి భద్రతలు లేవు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలసీ, రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. రెడ్‌బుక్ అరాచకంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మీరెన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షాన పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.


