ఎర్రాతివారిపల్లి(అన్నమయ్య జిల్లా): ఏపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల అదికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు ఈ ప్రభుత్వం.. ప్రజల ఓట్లతో గెలిచిందా.. లేక ఈవీఎంల ద్వారా మీరే గెలిపించుకున్నారా? అని నిలదీశారు.
ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం ఎర్రాతివారిపల్లిలో పుంగనూరు నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, తిరుపతి,చిత్తూరు జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి , మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు హాజరయ్యారు.
దీనిలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ‘ రాష్ట్రంలోమూడు రోజులుగా జరుగుతున్న పరిమాణాలు మీరందరు చూస్తున్నారు. ఈ ప్రభుత్వంను ప్రజలు ఓట్లతో గెలిపించారా....? ఈవీఎంలు ద్వారా గెలిపించుకున్నారా.. ?, కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. దీన్ని ప్రజలు గమనించాలి’ అని సూచించారు.


