సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు దాదాపు విజయం సాధించారు. అయితే, పంచాయతీ ఎన్నికలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పలు జిల్లాల నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయమై సీఎం రేవంత్ సహా నేతలు సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు పీసీసీ క్లాస్ ఇచ్చినట్టు తెలిసింది. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా రెబల్స్‌ను బుజ్జగించకపోవడం.. సొంత బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ సీరియస్ అయినట్టు తెలిసింది. కాగా, భవిష్యత్‌లో ఇది రిపీట్ అయితే ఉరుకునేది లేదని సీఎం రవంత్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
హస్తం జోరు..
ఇదిలా ఉండగా.. తెలంగాణలో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పల్లెల్లోనూ ఘనవిజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేసింది. మూడు విడతల ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. తొలి, రెండో దశ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ.. మూడో విడతలోనూ అదే జోరును ప్రదర్శించింది. మూడో విడతలో 4,159 స్థానాలకు గాను 2,286 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1,142 స్థానాలతో సరిపెట్టుకోగా.. బీజేపీ 242 స్థానాల్లో, సీపీఐ 24, సీపీఎం 7, ఇతరులు 479 స్థానాల్లో గెలుపొందారు.
రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా.. ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు గాను.. తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,502 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. మూడో విడతలో అత్యధికంగా 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మూడు విడతలు కలిపి రాష్ట్ర సగటు పోలింగ్ 85.30 శాతంగా నమోదైంది.


