అస్సాంలోని రైలు పట్టాలు గజరాజుల పాలిట మృత్యుపాశాలయ్యాయి. వేగంగా దూసుకొచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ తాజా ప్రమాదం భారతదేశంలో ఏనుగుల సంరక్షణపై ఉన్న సవాళ్లను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.
భారతదేశంలో ఏనుగుల అసహజ మరణాలకు విద్యుదాఘాతం మొదటి కారణం కాగా, రైలు ప్రమాదాలు రెండో ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం గత పదేళ్లలో 200 కంటే ఎక్కువ ఏనుగులు రైలు ఢీకొనడం వల్ల ప్రాణాలు కోల్పోయాయని అంతర్జాతీయ మీడియా సంస్థ ‘ది గార్డియన్’ పేర్కొంది.
సాంకేతికత ఒక్కటే పరిష్కారం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 40,000 నుండి 50,000 ఆసియా ఏనుగులు మాత్రమే అడవుల్లో మిగిలి ఉన్నాయి. ఇందులో సగానికి పైగా ఏనుగులు ప్రమాదాల బారిన పడుతున్నాయని పలు గణాంకాలు చెబుతున్నాయి. రైలు ప్రమాదాల నుండి ఏనుగులను కాపాడేందుకు సాంకేతికత ఒక్కటే మనముందున్న పరిష్కారం. తమిళనాడులో ఇప్పటికే ఏఐ-ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సెన్సార్లు పట్టాల దగ్గర ఏనుగుల కదలికలను గుర్తించి, తక్షణమే లోకో పైలట్లు, స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉన్న కొన్ని వ్యవస్థలు రోజుకు 40కి పైగా హెచ్చరికలను పంపుతూ, ప్రమాదాలను నివారిస్తున్నాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న 1,30,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, 150 ఏనుగు కారిడార్లలో ఈ వ్యవస్థలను పూర్తిస్థాయిలో అమలు చేయడం ఒక సవాలుగా మారింది.
గ్రీన్ ఫ్లైఓవర్లు కూడా అవసరం
కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా ఏనుగులు సురక్షితంగా మనుగడ సాగించేందుకు పశ్చిమ బెంగాల్‌లో నిర్మించిన ‘గ్రీన్ ఫ్లైఓవర్లు’ (ఆకులతో కప్పబడిన వంతెనలు) దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.. రైల్వే ట్రాక్‌ల వెంబడి అరటి, వెదురు వంటి చెట్లతో కూడిన కారిడార్లను నిర్మించడం వల్ల ఏనుగులు పట్టాలపైకి రాకుండా సురక్షిత మార్గాల్లో వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పట్టాలపై ఏనుగుల మరణాలను నివారించేందుకు ఏఐ ఆధారిత హెచ్చరిక వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయకపోతే, భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న ప్రమాదాలు
భారతదేశంలో రైలు ప్రమాదాల కారణంగా ఏనుగులు మృత్యువాత పడుతున్న గణాంకాలను పరిశీలిస్తే, 2009-10 నుండి 2020-21 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 186 ఏనుగులు రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయాయి. వీటిలో అత్యధికంగా అస్సాంలో 62, పశ్చిమ బెంగాల్‌లో 57, ఒడిశాలో 27 మరణాలు సంభవించాయి. ముఖ్యంగా తమిళనాడు-కేరళ సరిహద్దులోని కోయంబత్తూర్ - పాలక్కాడ్ మార్గంలో గత 19 ఏళ్లలో 29 ఏనుగులు చనిపోగా, అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 2017లో ఆరు ఏనుగులు, పశ్చిమ బెంగాల్‌లోని చప్రామారి అభయారణ్యంలో 2013లో ఏడు ఏనుగులు, ఒడిశాలోని కెంజోహర్‌లో2021లో మూడు ఏనుగులు రైలు ప్రమాదాల్లో మరణించాయి.ఇవి పర్యావరణవేత్తలతో పాటు అందరినీ కలవరపెడుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఏనుగుల మందను ఢీ కొట్టి.. అస్సాంలో రైలు ప్రమాదం


