
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పలువురు కీలక నేతలు అధికార కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలోనే నేతలు వ్యతిరేక గళం వినిపిస్తున్నారని తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గీయుల రాజకీయాలు యూటర్న్ తీసుకుంటున్నాయి. ఇరువురి మద్దతుదారులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేఎన్ రాజన్న బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి రాజన్న పార్టీ మారుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రాజేంద్ర రాజన్న తీవ్రంగా స్పందించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ రాజేంద్ర మాట్లాడుతూ.. బీజేపీలో చేరే బృందంలో బాలకృష్ణ ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత(డీకే శివకుమార్) వెంట వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు ప్రస్తావించకుండానే రాజేంద్ర పలు విమర్శలు చేశారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులం కాబట్టే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న పదవి పోవడం వెనక కొందరి ‘రహస్య హస్తం’ ఉంది. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ వల్లే పదవి దక్కింది. చివరివరకు అందులోనే కొనసాగుతాము అని వెల్లడించారు. ఇదే సమయంలో రాజన్న అసెంబ్లీలో ఆరెస్సెస్ గీతం పాడలేదని, చిన్నప్పటి నుంచి ఆయనకు ఆరెస్సెస్ శాఖల గురించి తెలియదని పరోక్షంగా డీకేకు చురకలంటించారు. రాజన్న సొంత భావజాలంతో పని చేసే వ్యక్తి అని కొనియాడారు.
డీకే శివకుమార్ విధేయుడు హెచ్‌సీ బాలకృష్ణ ఇటీవల మాట్లాడుతూ.. మంత్రిగా రాజన్న ప్రవర్తన, వాడిన భాష ఆయన పతనానికి కారణమని విమర్శించారు. పదవి పోవడం వెనక ఎలాంటి కుట్ర లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు అని సంచలన ఆరోపణలు చశారు.