
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ ఏడాది చివరినాటికి ఆ మార్పు తథ్యమంటూ అక్కడి మీడియా చానెల్స్ వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరిట కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో కన్నడ మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ముఖ్యమంత్రిని అయ్యే సమయం దగ్గరపడుతోంది అని నేను ఎక్కడా అనలేదు. కొంత మంది నేను సీఎం కావాలి అంటూ నినాదాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. కానీ, నా తలరాత ఏంటో నాకు తెలుసు. నాకేం తొందరలేదు అని వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో.. కొన్ని మీడియా సంస్థలు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయని, అలా అసత్య ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
తానేం సీఎం పదవికి ఆశపడడం లేదని మరోసారి స్పష్టం చేసిన డీకే.. తాను రాజకీయాల కోసం కాదని, ప్రజల సేవ కోసం పని చేస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపై మరోసారి తనను సంప్రదిస్తే మీడియాకు సహకరించబోనని స్పష్టం చేశారు. బెంగళూరులో లాల్‌బాగ్ వద్ద శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: తెలుగు ఐపీఎస్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్