
చండీగఢ్: ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్య హర్యానా పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్య కేసులో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా సీనియర్ పోలీసు అధికారి నరేంద్ర బిజార్నియాను తొలగించారు. బిజార్నియా స్థానంలో రోహ్‌తక్ ఎస్పీగా సురీందర్ సింగ్ భోరియా నియమితులయ్యారు. బిజార్నియాకు ఇప్పటివరకు ఎటువంటి పదవి ఇవ్వలేదు.
ఈ కేసులో హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్‌తో పాటు మరికొందరు ఉన్నతాధికారులపై కేసు నమోదయ్యింది. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2001 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఇటీవల చండీగఢ్‌లోని తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు పేజీల సూసైడ్ నోట్ లభించింది. దానిలో అతను కొందరు సీనియర్ అధికారులు తనను మానసికంగా వేధించారని, కులం పేరుతో అవమానించారని ఆరోపించారు. ఈ ఘటన దరిమిలా పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మృతికి కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అక్టోబర్ 7న ఏడీజీపీ వై పూరన్ కుమార్ మృతితో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దళిత సంస్థలు, రాజకీయ నేతలు త్వరితగతిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.