
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం మరోసారి మౌలిక సదుపాయాల సమస్యలతో చర్చకు దారితీసింది. నగరంలోని అధ్వాన్న రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే పలు మార్లు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా, మౌలిక సదుపాయాలు లేకపోతే తాము ఆస్తిపన్ను ఎందుకు చెల్లించాలి అంటూ పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
నగరంలో గుంతలు పడిన రోడ్ల విషయంలో ప్రభుత్వ చర్యలు వేగవంతం చేసింది. రోడ్లను గుర్తించి మరమత్తులు కూడా చేపట్టింది. అయినా నగర వాసులు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోతే ఆస్తిపన్ను కట్టబోమని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. అలా ఇప్పటి వరకు 13వేల గుంతలు పూడ్చినట్లు తెలిపారు. అలాగే, 550 కిలోమీటర్ల ప్రధాన రహదారుల అభివృద్ధికి వెయ్యి కోట్ల యాక్షన్ ప్లాన్‌ను రూపొందించమని అధికారులను ఆదేశించారు.
బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై వ్యక్తిగత పన్ను చెల్లింపు దారుల ఫోరం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసింది. లేఖలో, గ్రేటర్ బెంగళూరు మునిసిపల్ సంస్థలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే, ఆస్తిపన్ను వసూలు చేయకుండా ఉండాలని సూచించారు.
వర్తూర్-బలగేరె-పనతూర్ ప్రాంతాల్లో అసంపూర్ణ, శాస్త్రీయతలేని రోడ్ల పనులు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షాకాలంలో వరదలు, డ్రైనేజ్ పూర్తికాకముందే రోడ్ల పనులు ప్రారంభించడం, కొత్త రోడ్లు త్వరగా దెబ్బతినే ప్రమాదం, వైట్ టాపింగ్, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ పనులు ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం వంటి అంశాలను హైలెట్ చేశారు. మౌలిక సదుపాయాలు లేకుండా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడం అన్యాయం. బెంగళూరు ఐటీ హబ్‌గా గుర్తింపు పొందినప్పటికీ ‘గుంతలరోడ్లు, ట్రాఫిక్ జామ్, గార్బేజ్ సిటీ’ వంటి పేర్లు నగర గౌరవాన్ని తగ్గిస్తున్నాయని వాపోయారు.