కర్ణాటక: డీసీఎం డీకే శివకుమార్ సీఎం అవుతారా?, సీఎం సిద్దరామయ్య పదవిని కాపాడుకుంటారా అనేదానిపై మండ్య నగర బీజేపీ నాయకులు ఆదివారం చిలుక జోస్యం చెప్పించారు. అలా కాంగ్రెస్ సర్కారు పరిణామాలను ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్ పేరు చెప్పినప్పుడు చిలుక తీసిన చీటీలో చెంబు బొమ్మ వచ్చింది. సిద్దరామయ్య పేరు చెప్పినప్పుడు తీసిన చీటీలో బంతిపూవు వచ్చింది, ఇవి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీని అర్థం ఏమిటా అని తలోరకంగా మాట్లాడుకున్నారు.
శివకుమార్ సీఎం అయితే రాష్ట్ర ప్రజలకు చెంబు గతి పడుతుందని, సిద్దరామయ్య ప్రజల చెవిలో పువ్వులు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కూర్చుని కాపాడుకోడానికి ఒకరు, దానిని లాక్కోవడానికి మరొకరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలి కాలంలో 2,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదని అన్నారు.


