ఆయన పార్టీ కోసం ఎంతో చేశారు. అలాంటి వ్యక్తిని మోసం చేయడం వెన్నుపోటు కిందే లెక్క. త్యాగాలకు కూడా ఓ హద్దు ఉంటుంది. అది దాటితే పరిస్థితులు మరోలా మారతాయ్.. డీకే శివకుమార్ వర్గీయులు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల సారాంశం ఇది. శనివారం కర్ణాటక పవర్ పాలిటిక్స్ ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్ పడుతుందనే ప్రచారం వేళ.. ఈ తరహా పోస్టులు కుప్పలుగా కనిపిస్తున్నాయక్కడి గ్రూపుల్లో!..
కర్ణాటకలో నాయకత్వం మార్పు కోరుతూ అధికార పార్టీ రాజకీయం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను సీఎం చేయాలంటూ ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే డజను మంది ఎమెల్యేలు ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి తమ గళం వినిపించారు. ఇవాళ బెంగళూరు పర్యటనలో ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మరోసారి కలవాలనుకుంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయని డీకే శివకుమార్ మాత్రం గప్‌చుప్‌గా జైల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ములాఖత్‌కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఆయన త్యాగాలకు అంతే లేదా?..
బిహార్ ఎన్నికల ఫలితంతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో రాజకీయ సంక్షోభాన్ని కోరుకోవడం లేదు. అందుకే నాయకత్వ మార్పు ఉండదనే సంకేతాలను కాంగ్రెస్ వర్గాలకు పంపిస్తోంది. ఇది సిద్ధరామయ్య వర్గీయులకు ఊరట ఇచ్చే విషయమే. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గం మాత్రం అధిష్టానంపై ఒత్తిడి పెంచాలనే చూస్తోంది. సోషల్ మీడియాలో వినూత్న ప్రచారానికి దిగింది. ఆయనపై సింపథీ పెంచేందుకు గత త్యాగాలను గుర్తు చేస్తోంది.
డీకే త్యాగాల ట్రాక్ రికార్డు
డీకే శివకుమార్.. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలోకి అడుగుపెట్టి 1989లో తొలిసారి సతనుర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నెగ్గారు. యువ నాయకుడిగా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. రెండో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎస్‌ఎం కృష్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే ఉన్నారాయన.
2004–2013 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉంది. ఆ సమయంలో పార్టీని నిలబెట్టడానికి డీకే శివకుమార్ విశేషంగా కృషి చేశారు. ఆ సమయంలోనే సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు చేయాలంటూ అనుచరులు ఒత్తిడి చేసినా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ వాళ్లకు సర్దిచెప్పారు. ఈలోపు 2014–2019 మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో సిద్దూ సర్కార్‌లో మంత్రిగా పని చేశారు సిద్ధరామయ్య. అయితే.. 2019లో ED (Enforcement Directorate) దర్యాప్తు కారణంగా మంత్రిత్వ పదవి కోల్పోయారు. ఆ సమయంలో తన వ్యక్తిగత భవిష్యత్తును పక్కన పెట్టి, పార్టీ కోసం త్యాగం చేశారు.
అలా ట్రబుల్ షూటర్‌గా దేశవ్యాప్తంగా..
2019లో.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా.. ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకున్నారు డీకే శివకుమార్. అలా “ట్రబుల్ షూటర్”గా ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆపై 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(KPCC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్నివిధాల కృషి చేశారు. అక్కడి నుంచి 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన పేరు దేశం మొత్తం వినిపించింది. అయితే తన అనుచరులు ఆయనను ముఖ్యమంత్రి కావాలని కోరినా.. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించారు.
కష్టపడి.. త్యాగాలు చేసినవాళలకు ఆశలు ఉండడం సహజమేనని.. అయినా తనకు పార్టీ నిర్ణయమే తుదిదని చెబుతూ వస్తున్న డీకేకు ఇప్పుడు మద్దతు పెరుగుతోంది. తొలి నుంచి చేస్తున్న త్యాగాలు.. పార్టీ బలోపేతం కోసం చేసిన ప్రయత్నాలు.. ప్రభుత్వం కుప్పకూలకుండా చూసిన వైనం.. పార్టీ గెలుపు కోసం చేసిన కృషి, చివరకు ప్రత్యర్థులు ఎంత ఆశ చూపినా.. అధికారం కంటే పార్టీనే ముఖ్యమనుకుంటున్న ఆయన నిజాయితీతో కూడిన రాజకీయానికి పార్టీ తగిన న్యాయం చేయాలని మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు.


