సీఎం మార్పు అంశంలో ఏం జరిగినా బాధ పడనని స్పష్టీకరణ
అంతకు ముందు తన వర్గం వారితో సమావేశమైన సీఎం
తననే ముఖ్యమంత్రిగా కొనసాగించేలా వ్యూహరచన
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అధికార, నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సుమారు గంటకు పైగా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
ఖర్గేతో భేటీ అనంతరం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు రావడంతో కలిశానన్నారు. ఇదొక మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని చెప్పుకొచ్చారు. పార్టీ బలోపేతంపై, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు. నాయకత్వ మార్పు అంశంపై చర్చించలేదన్నారు. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు జరపడంపై స్పందిస్తూ ఎవరైనా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌తో మాట్లాడొచ్చని, అందులో ప్రత్యేకత ఏముందని ప్రశ్నించారు. సీఎం మార్పు అంశంలో ఏమి జరిగినా తాను బాధపడనని, అలాగే సంతోషపడనని కూడా చెప్పారు. ఏ విషయమైనా పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని, అది తానైనా, డీకే శివకుమార్ అయినా, పార్టీ నేతలెవరైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ!
ఖర్గేతో భేటీలో సిద్ధరామయ్య తననే సీఎంగా కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. శనివారం బెంగళూరు నగరంలోని సదాశివనగరలో ఉన్న ఖర్గే నివాసానికి తన వర్గం, నేతలు లేకుండా సీఎం సిద్ధరామయ్య ఒక్కరే వెళ్లడం గమనార్హం. ఇద్దరు నేతలు కలిసి సుదీర్ఘంగా పలు తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగిందని సమాచారం. అంతకు ముందు సీఎం తన అనుచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మంత్రులతో సమావేశమై చర్చించారు. సీఎం నివాసం కావేరికి మంత్రులు జమీర్ అహ్మద్‌ఖాన్, ఈశ్వర్ ఖండ్రే, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లారు.
ప్రస్తుత రాజకీయ సంక్షోభ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎంతో వారు చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో మంత్రి డి.సుధాకర్ కుమారుడి పెళ్లికి సీఎం హాజరై అక్కడి నుంచి నేరుగా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. తనకు ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని ఖర్గే చెప్పినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ పాలనకు ఎలాంటి ఆటంకం లేకుండా, సుపరిపాలన కొనసాగాలంటే తానే సీఎంగా కొనసాగాల్సిన ఆవశ్యకతను వివరించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే కూడా తానే సీఎంగా కొనసాగాలని చెప్పినట్లు సమాచారం. కాగా, సీఎం సిద్ధరామయ్య, ఖర్గే భేటీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. వారి భేటీకి ప్రత్యేకత ఏమీ లేదన్నారు. తాను ఉంటున్న ఇంటి నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఖర్గే నివాసం ఉందని తెలిపారు.


