వడ్డీలపై కాంగ్రెస్ కాకిలెక్కల డొల్లతనం బయటపడింది
వడ్డీల లెక్కలపై అబద్ధాలు చెప్పిన రేవంత్ క్షమాపణ చెప్పాలి : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు గత ప్రభుత్వం చేసిన అప్పులపై పదేపదే చెబుతున్న ’కాకి లెక్కల’ డొల్లతనం కాగ్ నివేదిక ద్వారా మరోసారి పూర్తిగా బట్టబయలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాగ్ అక్టోబర్ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, అప్పులు.. వాటికి కడుతున్న వడ్డీల లెక్కలను స్పష్టంగా పేర్కొందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పదేపదే అప్పులపై కాకి లెక్కలు చెప్తోందని తేలిపోయిందన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఆదాయం, కొత్త అప్పులు సరిపోతున్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న దు్రష్పచారాన్ని కాగ్ తాజా లెక్కలు పూర్తిగా కొట్టిపారేశాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రతి నెలా రూ. 6,000 నుంచి రూ.7,000 కోట్లు వడ్డీల కోసమే చెల్లిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతున్నారని విమర్శించారు. కానీ కాగ్ ఇచ్చిన తాజా నివేదిక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాల పైన మరోసారి చెంపదెబ్బ లాంటి వాస్తవాలను బయటపెట్టిందని కేటీఆర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు.
సగటు వడ్డీ రూ.2,361 కోట్లు
‘కాగ్ లెక్కల ప్రకారం ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన మొత్తం వడ్డీ కేవలం రూ.16,529.88 కోట్లు. అంటే నెలకు సగటున కేవలం రూ. 2,361.41 కోట్లు మాత్రమే. వడ్డీల పేరిట అబద్ధాలతోపాటు చేతకానితనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచి పెట్టుకుంటోంది. పార్లమెంట్ లెక్కల ప్రకారం.. పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ.2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే, 23 నెలల కాలంలోనే దాదాపు రూ.2.30 లక్షల కోట్ల అప్పులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో చేస్తున్న అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలకు తెలియజేయాలి. వడ్డీల పేరుతో పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ అప్పులన్నింటినీ తమ అనుచరులు, మధ్యవర్తులు, ఢిల్లీకి మూటలను పంపడానికే ఉపయోగిస్తున్నారు’అని కేటీఆర్ చెప్పారు.


