జనగామ తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా
భూ భారతిలో స్లాట్ బుకింగ్‌లో భారీ కుంభకోణం
యాదగిరిగుట్ట కేంద్రంగా ఇంటర్నెట్ నిర్వాహకుడి మాయాజాలం
రిజిస్ట్రేషన్ రుసుములో అత్యధిక శాతం లూటీ
ప్రత్యేక యాప్ సహాయంతో చలాన్ మొత్తాన్ని ఎడిట్ చేస్తున్న ముఠా
ఒక్క జనగామ జిల్లాలోనే 22 చలాన్ ఎడిట్ కేసులు వెలుగులోకి..!
దందా వెనుక మాస్టర్‌మైండ్‌గా హైదరాబాదీ.. ఇప్పటికే అదుపులో పలువురు?
సాక్షి ప్రతినిధి, వరంగల్/జనగామ: భూ భారతి పోర్టల్‌ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుములను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్న వైనం యాదాద్రి జిల్లాలో వెలుగులోకి వస్తోంది. జిల్లాకు చెందిన ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలిసింది. భూ భారతి స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ జనరేషన్ వరకు ఉన్న సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని రైతుల నుంచి పూర్తిస్థాయిలో డబ్బులు తీసుకుని ప్రభుత్వానికి నామమాత్రంగానే జమ చేస్తూ ఖజానాను కొల్లగొట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు జనగామ జిల్లాలోనే ఇలాంటి 22 కేసులు బయటపడగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ కుంభకోణం కొనసాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి జరుగుతున్న తంతు వెనుక ఓ ముఠా ఉందని, హైదరాబాద్‌కు చెందిన ఓ కీలక వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
తహసీల్దార్‌కు అనుమానం రాకుండా..
వివిధ భూ లావాదేవీల కోసం స్లాట్ బుకింగ్ సమయంలో మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పూర్తిగా చెల్లించకపోతే సిస్టమ్ అంగీకరించదు. కానీ యాదాద్రి జిల్లాకు చెందిన ఇంటర్నెట్ నిర్వాహకుడు తన వద్ద ఉన్న ప్రత్యేక యాప్ సహాయంతో చలాన్‌ను ఎడిట్ చేసే విధానాన్ని రూపొందించి, తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తంలో 10 శాతం కన్నా కూడా చాలా తక్కువకే (ఉదాహరణకు రూ.1.39 లక్షల చలాన్‌కు రూ.1,039) చలాన్ తీసి మిగిలిన మొత్తాన్ని తన జేబులో వేసుకున్నట్లు సమాచారం.
ఎడిటింగ్ ఇలా..
రిజిస్ట్రేషన్ పూర్తయ్యే దశలో తహసీల్దార్‌కు సైతం ఎలాంటి అనుమానాలు రాకుండా చలాన్ పూర్తి మొత్తంతో చెల్లించినట్లుగా చూపిస్తూ ఈ దందా కొనసాగించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక యాప్‌తో చలాన్ తీసేటప్పుడు సంబంధిత రుసుమును ఎడిట్ చేసి పేమెంట్ కంప్లీట్ చేస్తారు. దీంతో పేజీ స్లాట్ బుకింగ్‌కు వెళుతుంది. తర్వాత పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించడంతో పాటు తహసీల్దార్ లాగిన్‌లో స్లాట్ బుక్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. అయితే ఈ విషయం భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తులకు తెలియదు.
ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి పెద్దమొత్తంలో గండి పడుతోంది. జిల్లాతో పాటు జనగామలో కొందరు ఆపరేటర్లకు చిన్న మొత్తంలో కమీషన్ ఇవ్వడం ద్వారా వారిని ఈ అక్రమాల్లోకి లాగేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 22 చలాన్ ఎడిట్ కేసులు బయటపడగా, మొత్తం సంఖ్య 45 దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ధరణి పోర్టల్‌లో కూడా ఇలాంటి ఎడిట్ ఆప్షన్ ద్వారా ఇదే ముఠా మోసాలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జనగామలో కదిలిన డొంక..
ఇలాంటి ఘటనలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జనగామ పోలీసులు విచారణ ప్రారంభించారు. వరంగల్ పోలీసులు మాస్టర్‌మైండ్‌గా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం కాగా.. చలాన్ ఎడిటింగ్ గ్యాంగ్ సైతం పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గురువారం జనగామ తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓ గోపీరామ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. అయితే సాఫ్ట్‌వేర్‌లో ఏవైనా లోపాలున్నాయా అన్నదే పరిశీలించామని చెప్పారు. చలాన్ దందా లాంటి విషయం ఏమీ లేదు కదా? అని కలెక్టర్ అన్నారు.
అయితే పోలీసుల విచారణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో ఈ భారీ కుంభకోణం రాష్ట్రంలో ఎంతవరకూ వ్యాపించిందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి, మెదక్ సహా పలు జిల్లాల్లో కూడా ఇదే రకం అక్రమాలు జరిగాయా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. భూముల సంబంధిత ఎల్రక్టానిక్ ఎంట్రీలను ఉద్దేశపూర్వకంగా మార్చి అక్రమాలకు పాల్పడ్డారన్న సమాచారం మేరకు జనగామ పోలీసులు గత మూడు రోజులుగా కూపీ లాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది.


