‘ఉపాధి’ని దెబ్బతీస్తే సహించం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On MGNREGS Issue | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ని దెబ్బతీస్తే సహించం: సీఎం రేవంత్‌

Jan 9 2026 5:16 AM | Updated on Jan 9 2026 5:48 AM

CM Revanth Reddy Comments On MGNREGS Issue

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసే కుట్రలను సహించబోమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో 140 కోట్ల జనాభాలో 80 శాతం మంది ఉపాధి హామీ పథకంపై ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ పథకం పేదల ఆత్మ గౌరవాన్ని పెంచిందని, దీని రూపకల్పన, అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదికయ్యాయని సీఎం గుర్తు చేశారు. 

రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోదీ ప్రభుత్వం తెచ్చినప్పుడు, వాటికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ పోరాడారని చెప్పారు. చివరకు రైతులకు క్షమాపణ చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా చేయడంలో రాహుల్‌గాంధీ విజయవంతమయ్యారని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై మోదీతో దేశానికి క్షమాపణ చెప్పిస్తామన్నారు. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. 

అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక ఇన్‌చార్జ్‌ను నియమిస్తామని, తాను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని సీఎం వెల్లడించారు. ఫిబ్రవరి 3 నుంచి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, ములుగు సభకు సోనియాగాందీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాందీని ఆహా్వనిస్తామని చెప్పారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజున రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలని సూచించారు.  

ఎస్‌ఐఆర్‌ వెనుక పెద్ద కుట్ర  
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్లు తొలగించే ఎస్‌ఐఆర్‌ (సర్‌) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇల్లు లేని , ఆస్తి లేని పేదలకు ఉన్న గుర్తింపు కార్డే ఓటు అని, పేదల గుర్తింపును తొలగించేందుకు ఓట్లను తీసేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎస్‌ఐఆర్‌ తీసుకొచ్చిందని విమర్శించారు. ఎప్పుడైతే ఓటు హక్కు తొలగిస్తారో, అతని ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు కూడా పోతుందని, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి దేశంలో ఉండాలో, లేదో అని నిర్ణయించే శక్తి కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుందని ధ్వజమెత్తారు. సర్‌ పేరుతో ఓట్లను తొలగించి కోట్లాది మంది పేదలను ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి, వారిని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.  

మునిసిపోల్స్‌లో అంతటా కాంగ్రెస్‌ జెండా ఎగరాలి  
వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని సీఎం రేవంత్‌ చెప్పారు. గల్లీ గల్లీ కాదు, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ వల్లనే తాను ముఖ్యమంత్రి అయ్యానని, తెలంగాణ ఎప్పుడూ కాంగ్రెస్‌కు అండగా నిలిచిందని పేర్కొన్నారు. దేశం ఇబ్బందుల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో రాహుల్‌ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.  

20 నుంచి గ్రామగ్రామాన సభలు :మహేశ్‌గౌడ్‌ 
వీబీజీ –రామ్‌ జీ చట్టానికి వ్యతిరేకంగా ఏఐసీసీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఈ నెల 20 నుంచి 30వ తేదీల మధ్య అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, వీబీజీ–రామ్‌ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 5 వేల చొప్పున కరపత్రాలు ముద్రించి, అవి గ్రామగ్రామాన, వాడవాడకు చేరేలా పంపిణీ చేయాలని చెప్పారు. వీబీజీ –రామ్‌ జీ చట్టానికి వ్యతిరేకంగా ప్రతి డీసీసీ తప్పనిసరిగా గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 

బీజేపీ కుట్రలను గ్రామగ్రామానా ఎండగడతాం : భట్టి విక్రమార్క 
బీజేపీ పాలన సామ్రాజ్యవాదుల కంటే ప్రమాదకరంగా మారిందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవస్థాగతంగా కుట్ర చేస్తోందని ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో గాం«దీజీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా బ్రిటిష్‌ పాలకులు ఆయనపై లాఠీ కూడా ఎత్తలేదని, కానీ స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వ్యక్తులు గాంధీజీని హత్య చేశారని గుర్తు చేశారు. అందుకే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలమే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. ఉపాధి హామీ చట్టం రాకముందు రోజుకు రూ.40 ఉన్న కూలీ ఒక్కసారిగా రూ.100కి పెరిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ తెచ్చిన చట్టాలన్నింటినీ రద్దు చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు.  

– దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు గౌరవప్రదమైన ఉపాధి లభించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. సోనియాగాంధీ ఎంతో శ్రమించి పేదలకు పని హక్కు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్,, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అజాహరుద్దీన్, ఏఐసీసీ నేతలు విశ్వనాథన్, ప్రవీణ్‌ చక్రవర్తి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, హర్కర వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement