బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడి మంతనాలు
మల్లికార్జున ఖర్గే నివాసానికి క్యూ కట్టిన నేతలు
ఐదేళ్లూ తానే సీఎం అంటున్న సిద్ధరామయ్య
ఒప్పందం మేరకు తనను సీఎం చేయాలంటున్న డీకే
ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనని అధిష్టానం తర్జనభర్జన
సాక్షి బెంగళూరు/శివాజీనగర/బనశంకరి: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది. ఒప్పందం మేరకు తనను సీఎం చేయాల్సిందేనని డీకే గట్టిగా పట్టుబట్టారు. మరోవైపు పూర్తిగా ఐదేళ్లూ తననే సీఎంగా కొనసాగించాలని, అత్యధికంగా ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని సిద్ధరామయ్య చెబుతున్నారు. శుక్రవారం దాకా ఢిల్లీ కేంద్రంగా ఇరు వర్గాల నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఈ మేరకు ఒత్తిడి తెచ్చారు. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని గ్రహించిన అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది.
ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు వచ్చారు. స్వతహాగా కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గేకు ఇక్కడి రాజకీయాలపై పూర్తిగా అవగాహన ఉండడంతో సమస్య పరిష్కారానికి బరిలోకి దిగారు. శుక్రవారం రాత్రి కూడా డీకే శివకుమార్ బెంగళూరులో ఖర్గేతో సమావేశమై చర్చించారు. అధికార మారి్పడికి అంగీకరించాలని డీకే శివకుమార్ ఒత్తిడి చేశారు.
డీకే సోదరుడు సురేశ్, డీకే వర్గం ఎమ్మెల్యేలు కూడా శివకుమార్ వెంట ఉన్నారు. వారి డిమాండ్లు, విజ్ఞప్తులను ఖర్గే సావధానంగా విన్నారు. డీకే శివకుమార్ అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై సుదీర్ఘంగా డీకే శివకుమార్‌తో చర్చించారు.
సీఎం తాజా ప్రతిపాదన!
సిద్దరామయ్య శనివారం ఖర్గేతో కలిసి మాట్లాడారు. తననే సీఎంగా కొనసాగించాలని కోరారు. తనకే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినట్లు సమాచారం. డీకే శివకుమార్ వంటి ప్రభావవంతమైన నాయకుడిని దీటుగా ఎదుర్కొనేందుకు.. ఆయన మద్దతుదారు ఎమ్మెల్యేలు, ఆశావహులను నియంత్రించేందుకు తన వర్గం నుంచి మరో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండాలని సిద్ధరామయ్య ప్రతిపాదించినట్లు తెలిసింది.
ప్రస్తుతానికి హైకమాండ్ నేరుగా చర్యలు తీసుకోనప్పటికీ బెంగళూరు, ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. సిద్ధరామయ్య కూడా వరుస భేటీలతో తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటుండటం కనిపిస్తోంది.
ఆచితూచి అడుగులు వేస్తున్న అధిష్టానం
రానున్న రెండున్నరేళ్లు కూడా తానే సీఎం అంటూ సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేయడం, ఇందుకు ప్రతిగా ‘విష్ యు ఆల్ ది బెస్ట్. సిద్ధరామయ్యకు మంచి జరగాలి’ అంటూ డీకే శివకుమార్ కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఏ ముప్పు వస్తుందోనన్న తలనొప్పి ప్రస్తుతం హైకమాండ్‌కు ఏర్పడింది.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇరు వర్గాలకు అంగీకారయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని, తద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఆచితూచి అడుగులు వేస్తోంది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాన్ని వెల్లడించాలని చూస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నుంచి బెంగళూరు సదాశివనగరలోని మల్లికార్జున ఖర్గే నివాసం బిజీబిజీగా మారింది. వరుసగా నేతలు భేటీ అయ్యేందుకు తరలివస్తున్నారు. ఖర్గేతో సమాలోచనలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఒకే వేదికపై సిద్దరామయ్య, శివకుమార్
కర్ణాటక సీఎం మార్పుపై చర్చ జోరందుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఒకే వేదికపై ఆతీ్మయంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు హెబ్బాళలో జరిగిన ప్రపంచ మత్స్య దినాచరణలో వారిద్దరూ కలిసి పాల్గొన్నారు. చేపల పెంపకం, తదితర విషయాలపై శివకుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. సిద్దరామయ్య కూడా ప్రతిస్పందిస్తూ తల ఊపారు.
కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు: కుమారస్వామి
రానున్న రోజుల్లో కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని కేంద్ర మంత్రి హెచ్‌డీ.కుమారస్వామి జోస్యం చెప్పారు. శనివారం బెంగళూరులో జేడీఎస్ పార్టీ రజతోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం మార్పు అంటూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే రానున్న రోజుల్లో ఎవరూ ఊహించని రాజకీయ మార్పులు ఖాయం అన్నారు. ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పడానికి వీలులేని పరిస్థితి నెలకొందన్నారు.


