సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కర్ణాటక సర్కార్ ఏర్పడి నిన్నటితో రెండున్నరేళ్లు పూర్తైంది. దీంతో పవర్‌షేరింగ్ ఒప్పందం ప్రకారం సీఎం సిద్ధరామయ్యను గద్దె దించి.. తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేరుగా రంగంలోకి దిగకుండా.. తన అనుచరులను అధిష్టానంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.
డీకే శివకుమార్‌కు కర్ణాటక ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు మంత్రుల మద్దతు ఉంది. ఇందులో పది మంది తాజాగా ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వాన్ని మార్చాల్సిందేనని హైకమాండ్‌ను వాళ్ల కోరనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అప్పాయింట్‌మెంట్ లభించినట్లు సమాచారం. మరోవైపు.. సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకోవాలంటూ డీకే శివకుమార్ సోదరుడు, డీకే సురేష్ కోరుతున్నారు.
నాయకత్వ మార్పు ప్రయత్నాల్లో వేగం పెంచిన డీకే.. ఈ ఉదయం ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘‘ఎక్కడ ప్రయత్నాలు ఉంటాయో.. అక్కడ ఫలితం ఉంటుంది ... ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు’’ అంటూ నర్మగర్భంగా ట్వీట్ చేశారు.
ಎಲ್ಲಿ ಶ್ರಮ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಫಲವಿದೆ, ಎಲ್ಲಿ ಭಕ್ತಿ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಭಗವಂತ ಇದ್ದಾನೆ.. pic.twitter.com/7HyiIPWk1y
— DK Shivakumar (@DKShivakumar) November 21, 2025
అయితే ఐదేళ్లు సీఎంగా తానే కొనసాగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణకు అనుమతి కోరిన ఆయన.. తన వర్గీయులను కూడా ఢిల్లీకి పంపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణతో అసమ్మతికి చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. పీసీసీ చీఫ్ పదవి నుంచి శివకుమార్‌ను తొలగించే ప్రయత్నాల్లో ఆయన సగం సక్సెస్ అయినట్లు సమాచారం.
ఇక.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇప్పట్లో నాయకత్వ మార్పిడి లేదని సంకేతాలు ఇస్తోంది. ఎవరినీ ఢిల్లీకి రావొద్దని కోరింది. అయినప్పటికీ.. ఇరు వర్గాల ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే నాయకత్వం మార్పిడిపై తుది నిర్ణయం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీదేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందే తమకు శిరోధార్యమణి మరికొందరు ఎమ్మెల్యేలు చెబుతుండడం గమనార్హం. దీంతో.. సిద్ధూ, డీకే.. అధిష్టానం.. ఇలా మూడు వర్గాలుగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీలినట్లు స్పష్టమవుతోంది.


