డీకే శివకుమార్.. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం మిగతా రెండున్నరేళ్లు డీకే శివకుమార్ సీఎం పదవి చేపట్టాలి. అయితే ఇప్పుడు డీకే స్వరం మారింది. మొత్తం ఐదేళ్లు సిద్ధరామయ్యనే సీఎంగా ఉంటారని అన్నారు. తనకు 140 ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటూనే సిద్ధరామయ్యనే మిగతా కాలం కూడా సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. తామంతా సిద్ధరామయ్యకు సహకరిస్తామని తెలిపారు
డీకే. మిగతా కాలం కూడా తాను సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య అడిగారని, అందుకు తాను కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలిపారు. ఇక క్యాబినెట్‌ను కూడా సిద్ధరామయ్యే విస్తరించే అవకాశం ఉందన్నారు. చాలామందికి మంత్రులుగా చేయడానికి మొగ్గుచూపుతున్నారని, ఆ క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ అనేది ఆయనే చూసుకుంటారన్నారు. క్యాబినెట్‌ను మొత్తం మార్చాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుందన్నారు. ఇక్కడ హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఉంటుంది. హైకమాండ్ ఫైనల్‌గా ఏం ఖరారు చేస్తుందో అదే జరుగుతుంది.
గ్రూప్‌లు కట్టడం నా రక్తంలో లేదు
‘నాకు మొత్తం 140 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ నాకు గ్రూప్‌లు కట్టడం చేతకాదు. అది నా రక్తంలోనే లేదు’ అని అన్నారు. ఇక ఖర్గేను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎమ్మెల్యేలు కలవడంపై కూడా డీకే స్పందించారు. ‘ ఖర్గే సాబ్‌ను కలవడం అనేది ప్రతీ ఎమ్మెల్యేకు ఉన్న హక్కే. సీఎంను ఎలా కలుస్తామో.. ఖర్గే జీని కూడా అలాగే కలుస్తాం. ఢిల్లీకి వెళుతూ ఉంటాం. కలుస్తూ ఉంటాం. అది వారి హక్కు. నేనేమీ ఎవర్నీ తీసుకెళ్లి కలవను. కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఖర్గేను కలిశారు. అది వారి హక్కు. ఇందులో నేను చెప్పేదేముంది’ అని మీడియాను ఎదురు ప్రశ్నించారు.
డీకేకు ఏమైంది?
గత కొంతకాలంగా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర నడుస్తున్న చర్చ. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు అనేది. ముందస్తు ఒప్పందం ప్రకారం.. సిద్ధరామయ్య రెండన్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే తదుపరి సీఎంగా డీకే శివకుమార్‌కు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది,. మిగతా రెండున్నరేళ్లు సిద్ధరామయ్యే సీఎంగా ఉంటారని, తాము అంతా కలిసి ఆయనకు సహకారం అందిస్తామని డీకేనే చెప్పారు. అంటే ఇది హైకమాండ్ చెప్పిందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది.
ఇటీవల తదుపరి కర్ణాటక సీఎంగా రాష్ట్ర ప్రజా పనుల వ్యవహారాల శాఖ మంత్రి (పీడబ్ల్యూడీ) సతీష్ జార్కిహోళికే ఉన్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య ఓ బాంబు పేల్చారు. దాంతో కర్ణాటక కాంగ్రెస్‌లో గ్రూప్‌లు ఉన్న సంగతి బయటపడింది. దీన్ని పసిగట్టిన హైకమాండ్.. సీఎంను మార్చకపోవడమనే ఉత్తమం అని భావించి ఉండాలి. డీకే వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ, గ్రూప్‌లు కట్టడం తన రక్తంలో లేదంటూ స్సష్టం చేశారు. అదే సమయంలో సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్లు కొనసాగుతారన్నారు. దాంతో కర్ణాటక సీఎం మార్పు ప్రచారానికి తెర పడింది. హైకమాండ్ బుజ్జగించడంతోనే డీకే శివకుమార్ వెనక్కు తగ్గారనే ప్రచారం మొదలైంది.
#WATCH | Bengaluru: On speculations around the CM post in the state, Karnataka Deputy CM DK Shivakumar says, "...Making a group is not in my blood. All 140 MLAs are my MLAs. CM decided that he will reshuffle the Govt, the cabinet. So, all of them are interested in becoming… pic.twitter.com/bsSKhdhVXI
— ANI (@ANI) November 21, 2025
సీఎంగా నేనే ఉంటా: సిద్ధరామయ్య
ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం సీఎం మార్పు అంశంపై స్పందించారు. సీఎం మా ర్పు అనేది ఉండదని, మిగతా ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
ఫలితంగా సతీష్ జార్కిహోళి కథ పక్కకు వెళ్లిపోయింది. తన వర్గంలోని సతీష్ జార్కిహోళికి సీఎం పదవిని మిగతా కాలం అప్పచెబితే బాగుంటుందని సిద్ధరామయ్య వర్గం భావించినా అది కర్ణాటక కాంగ్రెస్‌లో మరింత కాక పుట్టించే అవకాశం ఉండటంతో సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగిస్తే బాగుంటుందనే కచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాతే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


