బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరులో పరిస్థితులపై పలువురు ప్రముఖులు కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తాజాగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై వ్యోమగామి శుభాన్షు శుక్లా సైతం సెటైరికల్ కామెంట్స్ చేశారు. సిటీలో ప్రయాణం చేయాడం నరకమే అనే విధంగా పరోక్షంగా వ్యాఖ్యానించారు.
వ్యోమగామి శుభాన్షు శుక్లా గురువారం బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్ (బీటీఎస్)లో ‘ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్’కు హాజరయ్యారు. ఈ సందర్బంగా శుక్లా మాట్లాడారు. అంతరిక్షంలో అడుగుపెట్టాక మన గుండెపై మోటారు వాహనం ప్రయాణించినట్లు ఉంటుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కనీసం వారం రోజులు పడుతుంది. భూమికి వచ్చాక రెండు వారాలపాటు మన శరీరం అదుపు తప్పే ఉంటుందని తన అనుభవాన్ని వివరించారు. ఈ ప్రయాణం భారతీయ అంతరిక్ష విజయానికి ప్రతీక అని తెలిశాక గర్వంగా ఉందన్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనపడుతుందో వీడియో రూపంలో చూపారు.
ఇక, ఇదే సమయంలో బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితిని వివరిస్తూ.. అంతరిక్షయానంపై తాను చేసే ప్రసంగ సమయంతో పోలిస్తే బెంగళూరు రహదారులపై ప్రయాణం మూడు రెట్లు అధికమని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా మారతహళ్లి నుంచి మూడు గంటలపాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇందులో మూడో వంతు సమయంలోనే తాను ప్రసంగాన్ని పూర్తి చేశానన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Group Capt. Shubhanshu Shukla, began his session at #BTS2025 with a sarcastic remark on #bengalurutraffic, saying he had taken “three times longer to reach the venue from Marathahalli, than the duration of his presentation.”@gagan_shux pic.twitter.com/1s2ewScM2J
— Elezabeth Kurian (@ElezabethKurian) November 20, 2025
ఇదిలా ఉండగా.. అంతకుముందు బెంగళూరులోని అధ్వానపు రోడ్ల సమస్యపై బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కిరణ్ మజుందార్-షా వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా స్పందిస్తూ, "ఆమె తన మూలాలను మరచిపోయారని", దీని వెనుక "వ్యక్తిగత అజెండా" ఉందని ఆరోపించారు. అయితే, షా ఈ ఆరోపణలను ఖండించారు. అనంతరం ఆమె రోడ్ల అభివృద్ధికి నిధులు ఇస్తానని ప్రకటించగా, దానికి డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు. ఆమె ఏ రోడ్లను అభివృద్ధి చేయాలనుకున్నా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.


