న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయన్నారు. లోక్‌సభ ఛాంబర్‌లో జరిగే ఉభయ సభల సభ్యుల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించడం సెషన్ మొదలవుతుందన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేతోపాటు సాధారణ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారని చెప్పారు. ఈ సెషన్ మొదటి దశ సమావేశాలు జనవరి 28– ఫిబ్రవరి 13వ తేదీ వరకు, రెండో దశలో మార్చి 9–ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉంటాయన్నారు. మధ్యలో ఫిబ్రవరి 13 నుంచి మార్చి 9 వరకు విరామం ఉంటుందన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం నాడు ప్రవేశపెట్టే బడ్జెట్‌ను గురించిన విషయాలను ఆయన వెల్లడించలేదు.


