ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే వర్సెస్ సిద్ధు
రెండున్నరేళ్ల సిద్ధరామయ్య పదవీ కాలం పూర్తి
కానీ, ఐదేళ్లు తానే సీఎం అంటున్న సిద్ధు
హామీ ప్రకారం అధికార మార్పిడికి డీకే వర్గం డిమాండ్
అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి పయనం
సాక్షి, బెంగళూరు: అందరూ ఊహించినట్లే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. 2023 వేసవిలో ఎన్నికల అనంతరం కుదిరిన చెరో రెండున్నరేళ్ల ఒప్పందం ప్రకారం... సీఎంగా సిద్ధరామయ్య వైదొలగాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి. గురువారంతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో అధికార మార్పిడిపై ఉత్కంఠ నెలకొంది. కానీ, అలాంటిదేమీ లేదని సంకేతాలు రావడంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండదని తేలింది.
దీంతో డీకే శివకుమార్ వర్గానికి చెందిన మంత్రులు చెలువరాయస్వామి, దినేశ్ గుండూరావు, ఎమ్మెల్యేలు ఇక్బాల్ హుస్సేన్, హెచ్‌సీ బాలకృష్ణ, ఎస్‌ఆర్ శ్రీనివాస్, గుబ్బి శ్రీనివాస్, రవిగణిగ, ఉదయ్‌గౌడ, అనేకల్ శివణ్ణ, రంగనాథ్, బసవరాజు తదితర పదిమందిపైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. అధికార మారి్పడి దిశగా చర్యలు లేకపోవడాన్ని ఢిల్లీలో అగ్ర నేతల ఎదుట లేవనెత్తేందుకు సిద్ధమయ్యారు. డీకేను సీఎం చేయాలని డిమాండ్ చేయనున్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కోరారు. ఆయనతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాం«దీతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వీరు అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉంది.
కర్ణాటకలో 2023 వేసవిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిద్ధు, డీకే వర్గాలు గట్టిగా పోటీపడడంతో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఎవరూ పట్టు వీడలేదు. దీంతో చెరో రెండున్నరేళ్లు ప్రతిపాదన తెచ్చి ముందుగా సిద్ధును సీఎంను చేసేలా అనధికార ఒప్పందం జరిగింది. అప్పటికి ఉప ముఖ్యమంత్రి పదవితో డీకే సర్దుకున్నారు. ఇప్పుడు రెండున్నరేళ్లు పూర్తి కావడంతో తమ నేతను సీఎం చేయాలంటూ డీకే మద్దతుదారులు, ఎమ్మెల్యేలు హస్తిన బాట పట్టారు.
ఐదేళ్లు నేనే సీఎం..
మిగతా రెండున్నరేళ్లు తానే సీఎంగా ఉంటానని, అధికార మారి్పడి లాంటిదేమీ లేదని సీఎం సిద్ధు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలు తమకు ‘ఐదేళ్లు’ అవకాశం ఇచ్చారని.. తాను కొనసాగుతానా? లేదా? అన్నది అప్రస్తుత చర్చ అని అంటున్నారు. నవంబర్ విప్లవం అంటూ సాగుతున్న ప్రచారం మీడియా కల్పితం అని కొట్టిపడేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా తానే బడ్జెట్ ప్రవేశపెడతానని తేల్చిచెప్పారు.
రెండున్నరేళ్ల కాలం ముగిసినందున కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలించవచ్చని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పారు. అయితే, దీనిపై రాహుల్‌తో చర్చించి చెబుతానని ఖర్గే హామీ ఇవ్వగా.. దానిని అధికార మార్పిడి అంటూ తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా తానే కొనసాగుతానని సిద్ధు చాలా స్పష్టంగా చెప్పడం, డీకే వర్గం అలర్ట్ కావడంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం సంక్షోభ దిశగా సాగుతోంది
అధిష్ఠానం ఇప్పుడు మార్పు చేస్తుందా?
బిహార్ ఎన్నికల్లో చతికిలపడి వారం రోజులు కూడా కాకముందే.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కర్ణాటక తలనొప్పి మొదలైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో మార్పులు చేసి ఇబ్బంది కొని తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో సిద్ధు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఆయన అంత ధైర్యంగా, బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఈ క్రమంలో తమకు అన్యాయం జరుగుతున్నదని గ్రహించిన డీకే వర్గం వెంటనే తేరుకుంది. అధిష్ఠానం వద్ద తేల్చుకునేందుకే డీకే వర్గం ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.


