బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ రన్ అవుతోంది. కన్నడలో ఈ ఏడాది కూడా హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. మొదట రెండు రోజుల పాటు ఈ షో మూసివేశారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా ఆపేసి.. మళ్లీ రెండు రోజుల తర్వాత షో ప్రారంభించారు.
తాజాగా కన్నడ బిగ్‌బాస్ సీజన్-12పై మరో వివాదం మొదలైంది. బిగ్‌బాస్ హౌస్ కుల వివక్ష, మహిళలను అవమానించేలా ఉందంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిచ్చా సుదీప్‌తో పాటు కంటెస్టెంట్స్ అశ్విని గౌడ, రషిక పేర్లను ఫిర్యాదులో చేర్చింది.
కంటెస్టెంట్ రక్షితను అవమానించేలా హోస్ట్ సుదీప్ వ్యాఖ్యలు చేశారని సంధ్య పేర్కొంది. ఇది మహిళలను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఓ ఎపిసోడ్‌లో రషికపై మరో కంటెస్టెంట్ మాలవల్లి నటరాజ్ (గిల్లి) శారీరకంగా దాడి చేశాడని వెల్లడించింది. అంతేకాకుండా కర్ణాటక రక్షణ వేదికతో సంబంధం ఉన్న పోటీదారు అశ్విని గౌడను ఉద్దేశించి కుల వివక్ష వ్యాఖ్యలు చేయడం, రక్షిత నేపథ్యాన్ని అపహాస్యం చేశారంటూ ఫిర్యాదులో వివరించింది. అయితే ఈ వివాదంపై కిచ్చా సుదీప్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆయన 'మార్క్' షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 25న పండుగ విడుదల కానుంది.


