శబరిమలలో భక్తుల భద్రతను నిర్థారించాలని కోరుతూ కేరళ ప్రధాన కార్యదర్శికి కర్ణాటక ప్రభుత్వం లేఖ పంపింది. శబరిమల వచ్చే భక్తులకు తగిన భద్రత,రవాణా సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొంది. లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు కర్ణాటకకు వస్తున్నారని, అందువల్ల వారి భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాట ప్రభుత్వం లేఖలో కోరింది. ఈ లేఖను కర్ణాటక కార్యదర్శి కేరళ ప్రధాన కార్యదర్శికి పంపారు.
ఇదిలా ఉండగా, శబరిమల యాత్ర నిమిత్తమై దేవస్వం బోర్డుభక్తులకు ఎలాంటి ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించ లేదంటూ అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం విమర్శలు ఎక్కుపెట్టింది. అంతేగాదు భక్తుల భద్రతా విషయమై ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేపోయిందని దేవస్వం బోర్డుపై ధ్వజమెత్తింది.
గతంలో అఖిల కేరళ అయ్యప్ప సేవా సంఘం దాదాపు 4 వేల మంది వాలంటీర్లతో శబరిమలలో తాగునీరు, ఉచిత ఆహారం ఇతర సేవలను అందించింది. అయితే, దేవస్వం బోర్డు కోర్టును ఆశ్రయించిన తర్వాత రెండేళ్లుగా ఇది నిలిపేశారు. అవినీతికి మార్గం సుగమం చేయడానికి అయ్యప్ప సేవా సంఘాన్ని అక్కడి నుంచి బహిష్కరించాలని కొంతమంది దేవస్వం బోర్డు అధికారులు కోర్టును ఆశ్రయించారని వాదనలు కూడా వినిపించాయి. అయితే అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం మాత్రం అవకాశం ఇస్తే..ఇప్పుడైనా అన్ని సేవలను ఉచితంగా అందిస్తామని పేర్కొనడం గమనార్హం.
(చదవండి: శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా..రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం..)


