టీవీకే అధినేత సినీ నటుడు విజయ్ రేపు తమిళనాడు కాంచీపురం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఓ ప్రైవేట్ కాలేజ్ కు చెందిన గ్రౌండ్ లో కేవలం రెండు వేల మంది పార్టీ ప్రతినిధులతో సభ నిర్వహించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన ర్యాలీలో జరిగిన ప్రమాదం తర్వాత విజయ్ ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి.
సినీహీరో విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ హీరో రాజకీయంగా సైతం తమిళనాట తన సత్తా చూపించాలని తమిళిగ వెట్రి కజగం ( టీవీకే) పార్టీ స్థాపించారు. తన మార్కుకు అనుగుణంగానే లక్షల మందితో బహిరంగ సభలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ ని సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన ర్యాలీలో జరిగిన ప్రమాదం అపఖ్యాతి పాలు చేసింది. ఇరుకైన ప్రదేశంలో ర్యాలీ నిర్వహించడంతో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రజలు చనిపోయారు. ఈ ఘటన తమిళనాడునే కాకుండా యావద్దేశాన్ని కలిచివేసింది.
ఈ నేపథ్యంలో తమిళ స్టార్ విజయ్ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. కాంచిపురం జిల్లాలో రెండు వేల మంది పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్ భద్రతకు సంబంధించి ఇదివరకే పార్టీకి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా లోపలికి వెళ్లే వ‍్యక్తులకు క్యూఆర్ కోడ్ ఉన్న ప్రత్యేక పాస్ లు మంజూరు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ మీటింగ్ లో విజయ్ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 4న ర్యాలీ అనుమతి కోసం టీవీకే ప్రయత్నించగా భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో టీవీకే పార్టీ ఈ మీటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం
తమిళనాడులో ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయాలని చూస్తోంది. ర్యాలీలకు, భారీ సభలకు పోలీసుల అనుమతికి సమయం పడుతున్న నేపథ్యంలో వీలైనన్ని ఇండోర్ మీటింగ్ లు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని టీవీకే భావిస్తున్నట్లు తెలుస్తోంది.


