తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ఎలక్షన్స్‌లో తను స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' తరపున పోటీ చేయనున్నాడు. అయితే ఈసారి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నాడు సీనియర్ నటుడు సుమన్.
జనాల్లో అనుమానాలు
తాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనాలు సెలబ్రిటీలను చాలారకాలుగా పరిశీలిస్తారు. ఈ హీరో నిజంగానే పొడుగ్గా ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా? ఆయన జుట్టు ఒరిజినలేనా? గొంతు తనదేనా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి హీరో సభకు వస్తుంటారు. మొదటిసారి వచ్చినంతమంది జనాలు రెండోసారి రారు. అయినా రెండోసారి, మూడోసారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వస్తున్నారంటే అది భయంకరమైన ఫాలోయింగ్ అని అర్థం.
సినిమా వదిలేయాల్సిందే!
ఏదేమైనా ఆయన అదృష్టం, జాతకాన్ని బట్టి రాజకీయాల్లో ఫలితం ఉంటుంది. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చి గెల్చారంటే మాత్రం మూవీస్ వదిలేయాల్సిందే! ఎందుకంటే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టి గెలిపించారంటే ఎక్కడా ఏ తప్పూ జరగకుండా చూసుకోవాలి! సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి.. ఆ నింద హీరోపైనే వేస్తారు.
రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం
అందుకే గెలిచేవరకు ఆగండి. గెలిచిన తర్వాత మాత్రం తప్పనిసరిగా సినీ జీవితాన్ని పక్కనపెట్టండి. సినిమాల్లోకి ఎప్పుడైనా రావొచ్చు.. కానీ రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం.. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం.. ఇలా ఏమేం చేయాలో అన్నీ చేయండి.. ఆల్‌రెడీ సగంలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ప్రజాసేవకు అంకితం కండి. ప్రజలకు అనేక సమస్యలున్నాయి.
విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్
మీరు షూటింగ్‌కు వెళ్తే ఏమంటారంటే.. ఆయన షూటింగ్‌కు వెళ్లకుంటే ఈ పని పూర్తి చేయొచ్చు అని పెదవి విరుస్తారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆల్‌రెడీ ఒప్పుకున్న సినిమాను పూర్తి చేశారు తప్ప మళ్లీ సినిమాల్లోకి వెళ్లలేదు. విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓటు వేయడానికి ఒకటీరెండు రోజుల ముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే అంతా మారిపోతుంది. లేదు, ఆయనకు అదృష్టం ఉంటే కచ్చితంగా విజయ్ సీఎం అవుతాడు అని సుమన్ చెప్పుకొచ్చాడు.
చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. గూండా అని పేరెంట్స్ తిట్టారు


