గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025: జ్యూరీ కమిటీలో కీలక మార్పు! | Telangana Gaddar Film Awards 2025: Key Changes In Jury Committee | Sakshi
Sakshi News home page

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025: జ్యూరీ కమిటీలో కీలక మార్పు!

Feb 19 2026 5:57 PM | Updated on Feb 19 2026 6:05 PM

Telangana Gaddar Film Awards 2025: Key Changes In Jury Committee

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025' జ్యూరీ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా 'స్పెషల్ అవార్డ్స్' ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీకి చైర్మన్‌గా సీనియర్ నిర్మాత, విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్ర పరిశ్రమపై తమ్మారెడ్డికి ఉన్న సుదీర్ఘ అనుభవం, సామాజిక అంశాలపై ఆయనకున్న లోతైన అవగాహనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 19, 2026న (ఉగాది పర్వదినం సందర్భంగా) ఈ పురస్కారాలను అత్యంత వైభవంగా అందజేయనున్నారు.   2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలు ఈ అవార్డులకు అర్హమైనవి.    మొత్తం 17 విభాగాల్లో ఈసారి పురస్కారాలు ఇవ్వనున్నారు. సామాజిక స్పృహ కలిగించే చిత్రాలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ 'ఉత్తమ సామాజిక సందేశ చిత్రం', 'డాక్టర్ సి. నారాయణరెడ్డి' పేరుతో ప్రత్యేక అవార్డులను కూడా ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం వివిధ జ్యూరీ కమిటీల ఆధ్వర్యంలో సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే విజేతల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement