అందుకే ‘ఎల్లమ్మ’ లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నా : దేవిశ్రీ | Devi Sri Prasad Intersting Comments On Yellamma Movie | Sakshi
Sakshi News home page

అందుకే ‘ఎల్లమ్మ’ లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నా : దేవిశ్రీ

Feb 19 2026 4:47 PM | Updated on Feb 19 2026 6:01 PM

Devi Sri Prasad Intersting Comments On Yellamma Movie

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ‘ఎల్లమ్మ’ మూవీతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘బలగం’ఫేం వేణు యెల్దండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని నానితో తెరకెక్కించాలనుకున్నారు. కానీ డేట్స్‌ కుదరకపోవడంతో  నాని నో చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత నితిన్‌ హీరోగా చేయబోతున్నట్లు  దిల్‌ రాజు అధికారికంగా ప్రకటించాడు కూడా. కానీ తమ్ముడు మూవీ రిలీజ్‌ తర్వాత నితిన్‌ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. చివరకు దేవీశ్రీ ప్రసాద్‌ హీరోగా ఎల్లమ్మ పట్టాలెక్కింది. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు వదిలిన గ్లింప్స్‌కి ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. బీజీఎంతో పాటు దేవీ లుక్‌పై కూడా ప్రశంసలు వచ్చాయి. తనదైన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డీఎస్పీ..ఇప్పుడు నటనతోనూ ఆకట్టుబోతున్నట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమైంది. అయితే హీరోగా మారినప్పటికీ.. సంగీతాన్ని వదలబోనని అంటున్నాడు డీఎస్పీ. అంతేకాదు సంగీతానికి మంచి స్కోప్‌ ఉన్న కథ కాబట్టే ‘ఎల్లమ్మ’లో నటించడానికి ఒప్పుకున్నానని చెబుతున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎల్లమ్మ’ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అందుకే ఒప్పుకున్నా.. 
సినిమాల్లో నటించాలని ఎప్పుటి నుంచో అనుకుంటున్నా. చాలా మంది దర్శకులు నన్ను హీరోగా చేయమని అడిగారు. సుకుమార్‌ దర్శకత్వంలోనే నేను హీరోగా పరిచయం కావాల్సింది. కానీ నాన్న చనిపోవడంతో బాధలో ఉండి నేనే నటించడానికి ఆసక్తి చూపించలేదు. త్రివిక్రమ్‌, హరీశ్‌ శంకర్‌ కూడా సినిమా చేస్తామని చెప్పారు. కానీ కుదరలేదు. నేను చాలా స్క్రిప్టులు విన్నాను. ఒక్కటి కూడా నాకు సెట్‌ అయ్యేలా అనిపించలేదు. కానీ ఎల్లమ్మ కథ వినగానే నచ్చేసింది. వెంటనే ఓకే చెప్పా. నెలన్నరలో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

నెలకు పది రోజులు మాత్రమే.. 
సినిమాల్లో నటించినప్పటికీ సంగీతానికి మాత్రం బ్రేక్‌ ఇవ్వను. మ్యూజికే  నా మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే నటన. ఎల్లమ్మ కథ కూడా గొప్ప సంగీతంతో ముడిపడి ఉంటుంది. అందుకే నాకు బాగా నచ్చింది. పైగా నిర్మాత దిల్‌ రాజు కూడా నాకు మంచి ఆఫర్‌ ఇచ్చాడు. ‘నెలకు 10 రోజులు మాత్రమే షూటింగ్‌ ఉంటుంది. మిగతా రోజులన్నీ నీ సంగీతానికే కేటాయించుకో’ అని చెప్పారు. దర్శకుడు వేణు కూడా సపోర్ట్‌ చేశాడు. అందుకే ఈ సినిమా చేయాలని అనుకున్నాను.

అప్పుడు ‘దేవి’..ఇప్పుడు ‘ఎల్లమ్మ’
నేను సంగీతం అందించిన మొదటి సినిమా ‘దేవి’. ఎల్లమ్మకు మరో పేరు ఇది. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ కథతోనే హీరోగా పరిచయం అవుతున్నాను. ఇలా ఒక సంగీత దర్శకుడిగా, హీరోగా రెండూ ‘అమ్మవారి’ కథలతోనే పరిచయం అవడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా బీజీఎం పనుల్లో బిజీగా ఉన్నా. ఇది పూర్తయిపోయిన వెంటనే ‘ఎల్లమ్మ’ షూటింగ్‌లో పాల్గొంటా. ఎల్లమ్మ సినిమా అనేది నన్ను, నా సంగీతాన్నీ ప్రేమంచే ప్రతీ ఒక్కరికి నేను ఇస్తున్న బహుమతి’ అని దేశిశ్రీ ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.  

Advertisement
 
Advertisement
Advertisement