బాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్‌లో శక్తి కపూర్ ఒకరు. అయితే ఆయన విలన్‌గా నటించడం ఇంట్లోవాళ్లకు అస్సలు ఇష్టముండేది కాదట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శక్తి కపూర్ మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటన ఇది. నేను నటించిన ఓ పెద్ద సినిమా 'ఇన్‌సానియత్‌కే దుష్మన్' అప్పుడే రిలీజైంది.
చున్నీ లాగే సీన్..
ఆ మూవీ చూడమని మా పేరెంట్స్‌కు చెప్పాను. అమ్మానాన్న ఇద్దరూ థియేటర్‌కు వెళ్లారు. సినిమా ప్రారంభంలోనే నేను ఓ అమ్మాయి చున్నీ లాగుతూ ఉంటాను. అది చూడగానే మా నాన్నకు చిరాకొచ్చింది. చలో, చూసింది చాలు, ఇక వెళ్లిపోదాం అని అమ్మతో అన్నాడు. వాడు బయట గూండాలా చేస్తాడు.. ఇప్పుడు సినిమాలో కూడా అదే చేస్తున్నాడు.
చెడామడా తిట్టారు
ఇది చూసేందుకా మనం వచ్చింది? ఏం అక్కర్లేదు, నాకైతే సినిమా చూడాలని లేదంటూ అమ్మతో కలిసి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి రాగానే నన్ను చెడామడా తిట్టారు. ఎలాంటి పాత్రలు చేస్తున్నావ్? ఇంత నీచమైన పనులు చేయడానికి మనసెలా వస్తుంది? గూండా పాత్రలు పక్కనపెట్టి మంచి రోల్స్ చేయు.. హేమమాలిని, జీనత్ అమన్ వంటి వారి పక్కన హీరోగా నటించమని చెప్పారు.
నెగెటివ్ రోల్స్ వల్లే..
నాకు జన్మనిచ్చింది మీరే.. ఈ ముఖాన్ని సృష్టించింది మీరే.. నా ముఖం చూసి ఎవరూ హీరోగా లేదా మంచి పాత్రలు ఇవ్వడం లేదు. విలన్‌గానే నటించమని అడుగుతున్నారు. వాటిని తిరస్కరించేంత శక్తి నాకు లేదు. పైగా ఆ నెగెటివ్ రోల్స్ వల్లే అంతో ఇంతో గుర్తింపు వస్తోంది అని నచ్చజెప్పాను అన్నాడు. కాగా అండాజ్ అప్న అప్న, గుండా వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన విలనిజం పండించాడు శక్తి కపూర్.


