కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య ‘పవర్’పాలిటిక్స్
ముఖ్యమంత్రి పదవిపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన డీకే శివకుమార్
తన మద్దతుదారులను ఢిల్లీకి పంపి అధిష్టానంపై ఒత్తిడి
రహస్య ఒప్పందం ప్రకారం సీఎం పదవి డీకేకు ఇవ్వాలని విన్నపం
సీఎం పదవి నుంచి దిగిపోవడానికి ససేమిరా అంటున్న సిద్ధరామయ్య
తననే కొనసాగించాలని ఇప్పటికే రాహుల్, ఖర్గేలతో చర్చ
ఈ దిశగా మరింత ఒత్తిడి తెచ్చేందుకు సీఎం వర్గీయులు డిన్నర్ మీటింగ్
బీహార్ ఫలితాల నేపథ్యంలో ఎటూ నిర్ణయించలేకపోతున్న అధిష్టానం
సాక్షి, బెంగళూరు : ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ చదరంగంలో వేగం పెంచారు. 2023 ఎన్నికల సమయంలో కేపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి, పార్టీని ఏకతాటిపైకి తెచ్చి అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఆయన తన కృషికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు.
అయితే డీకే శివకుమార్ ఆశలకు సీనియర్ నేత సిద్ధరామయ్య బ్రేకులు వేశారు. ముఖ్యమంత్రి పదవికి డీకే శివకుమార్‌తో పోటీ పడ్డారు. బలమైన ఎమ్మెల్యేల మద్దతుతో సిద్ధరామయ్య ఢిల్లీలో చక్రం తిప్పడంతో హైకమాండ్ సిద్ధరామయ్య వైపు మొగ్గింది. దీంతో డీకే కినుక వహించడంతో రొటేషన్ పద్ధతితో చెరో రెండున్నరేళ్లు పవర్ షేరింగ్‌కు ఇద్దరు నేతలను ఒప్పించి.. డీకేను ఉప మఖ్యమంత్రి చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగాయి.
ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ 20తో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అనధికార రహస్య ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్‌కు సిద్ధరామయ్య అప్పగించాలి. అయితే సిద్ధరామయ్య అడ్డం తిరిగి సీఎం పదవి నుంచి దిగిపోయేందుకు ససేమిరా అనేశారు. దీంతో డీకే శివకుమార్ ఖంగు తిన్నారు. హైకమాండ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తన మద్దతుదారులను ఢిల్లీ పంపి అధిష్టానంపై వారి ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు యతి్నస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో గురువారం వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి అధికార మారి్పడి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని విన్నవించారు. డీకే శిబిరంలో మంత్రులు చెలువరాయస్వామి, కుణిగల్ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్, హొసకోటె ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ, ఆనేకల్ ఎమ్మెల్యే శివణ్ణ, శృంగేరి ఎమ్మెల్యే రాజేగౌడ, నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాస్, గుబ్బి ఎమ్మెల్యే ఎస్‌ఆర్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దినేశ్ గూళిగౌడ తదితరులు ఢిల్లీలో హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారు.
సీఎం కుర్చీని నేనొదలను..
‘సీఎం కుర్చీని నేను వదలనుగాక వదలను’అన్నట్లుంది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీరు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లి అధికార మారి్పడి ఒప్పందాన్ని అమలు చేయాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న సిద్ధరామయ్య వర్గం వెంటనే అలర్ట్ అయ్యింది.
మంత్రులు డాక్టర్ జి.పరమేశ్వర్, డాక్టర్ హెచ్‌సీ మహదేవప్ప, సతీశ్ జార్కిహోళి, దినేశ్ గుండూరావు, వెంకటేశ్, మాజీ మంత్రి కేఎన్ రాజణ్ణ తదితరులు బెంగళూరులో సతీశ్ జార్కిహోళి ఇంటిలో డిన్నర్ మీటింగ్‌లో కలుసుకుని, ఐదేళ్ల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే కొనసాగేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించుకున్నారు. డీకే వర్గం తరహాలో తాము కూడా ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలకు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని మనవి చేయాలని తీర్మానించారు.
మల్లికార్జున ఖర్గే చేతుల్లో నిర్ణయం?
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎత్తుకు పైఎత్తులు, వర్గ పోరు అధికమవ్వడంతో మల్లికార్జున ఖర్గే శనివారం బెంగళూరుకు రానున్నట్లు తెలిసింది. ఇరు వర్గాల నేతలతో వేర్వేరుగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని సమాచారం. గురువారం చామరాజనగరలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ఐదేళ్లూ తానే సీఎం అని, వచ్చే బడ్జెట్‌ను కూడా తానే ప్రవేశపెడతానని చెప్పుకు రావడం చూస్తుంటే అధిష్టానం మద్దతు సిద్ధరామయ్యకేనని తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల సిద్ధరామయ్య.. రాహుల్ గాందీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం అవ్వడాన్ని ఉదహరిస్తున్నారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో అధిష్టానం పూర్తిగా డీలా పడిన నేపథ్యంలో కర్ణాటక విషయంలో కోరి కొరివితో తల గోక్కోవడం ఎందుకనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.


