హిల్టప్ పేరిట సీఎం రేవంత్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపణ
సీఎం సోదరులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపుల లబ్ధికే హిల్టప్
9,292 ఎకరాల భూమిని క్రమబద్దీకరించేందుకు ఈ పాలసీ తెచ్చారు
దీనిద్వారా రూ. లక్షల కోట్ల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగింత
రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతానికే రెగ్యులరైజేషన్..
తద్వారా ప్రైవేటు వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయల లబ్ధి జరుగుతుందన్న మాజీ మంత్రి
బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక వీటి క్రమబదీ్ధకరణ రద్దు చేస్తామని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదిలీ విధానం (ఇండ్రస్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్టప్) పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని ఆయన అన్నారు.
సీఎంకు సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, సోదరులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే హిల్టప్ రూపొందించారని చెప్పారు. హిల్టప్ ద్వారా వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అతి తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
మేం 200% వరకు అదనంగా వసూలు చేశాం
‘హైదరాబాద్‌లోని బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఆజామాబాద్ తదితర కీలక పారిశ్రామిక వాడల్లోని సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబదీ్ధకరించేందుకు హిల్టప్ తెచ్చారు. ఎకరా భూమిని సగటున కనీసం రూ.50 కోట్లుగా పరిగణించి లెక్కిస్తే ఈ భూముల విలువ రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఈ భూములను రిజి్రస్టేషన్ విలువలో కేవలం 30 శాతానికే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోంది. ఎస్‌ఆర్‌ఓ విలువలో కేవలం 30 శాతం వసూలు ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయల లబ్ధి జరుగుతుంది. గతంలో మేము ఆజామాబాద్ పారిశ్రామిక వాడలోని భూములకు ఎస్‌ఆర్‌ఓ రేట్ల కంటే 100 నుంచి 200 శాతం అదనంగా వసూలు చేసి ఖజానాకు ఆదాయం సమకూర్చాం..’అని కేటీఆర్ పేర్కొన్నారు.
క్రమబద్ధీకరణకు మేం అంగీకరించలేదు
‘బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు అత్యంత తక్కువ ధరలకు క్రమబద్ధీకరణ కోసం నన్ను సంప్రదించినా తిరస్కరించా. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ప్రయోజనాల కోసం చౌకగా ఇవ్వలేమని చెప్తే ఇప్పుడు రేవంత్ మాత్రం..అప్పనంగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రైవేటు వ్యక్తులకు భూముల క్రమబద్ధీకరణ 45 రోజుల్లో పూర్తి చేయాలనే హిల్టప్ పాలసీ వెనుక ప్రభుత్వ తొందరపాటు కనిపిస్తోంది. ఈ పాలసీ కేబినెట్ ముందుకు రాకమునుపే రేవంత్ సోదరులు, అనుచరులు, బ్రోకర్లు ముందస్తు డీల్స్ కుదుర్చుకున్నారు. హి«ల్టప్ పాలసీ కాంగ్రెస్‌కు ఏటీఎమ్‌గా మారి, ఎంపిక చేసిన కొద్ది మందిని ధనవంతులుగా మారుస్తుంది..’అని బీఆర్‌ఎస్ నేత చెప్పారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా రేవంత్
‘సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తూ మెట్రో రైలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పారిశ్రామిక భూములపై కన్నేశారు. ఇందిరమ్మ ఇళ్లు, స్మశాన వాటికలకు కూడా భూమి దొరకని హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని రేవంత్ అనుకుంటున్నారు. తద్వారా కనీసం రూ. 50 వేల కోట్లను తన జేబులో వేసుకోవాలని చూస్తున్నాడు.
హిల్టప్ కింద ఒప్పందాలు కుదుర్చుకునే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబదీ్ధకరణను రద్దు చేసి కుంభకోణంలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకుంటుంది. హిల్టప్ పాలసీని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘ఫార్ములా ఈ’రేసు వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ విషయంలో లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని ప్రకటించారు.


