హైదరాబాద్: కోట్ల రూపాయిల మోసం కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఉప్పల సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల సతీష్ కోసం నెల నుంచి గాలిస్తున్న పోలీసులు.. ఎట్టకేలకు ముంబైలో అరెస్ట్ చేశారు. రూ. 23 కోట్ల రూపాయిల మోసం కేసులో ఉప్పల సతీష్ ప్రధాన నిందితుడు. ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేసినట్లు ఉప్పల్ సతీష్‌పై అభియోగాలున్నాయి.
అయితే నెలక్రితం సతీష్‌న ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తప్పించాడు. ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్‌కు రెండు కోట్ల రూపాయిలు ఆఫర్ చేసినట్లు ఆరోపణులున్నాయి. దాంతో ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం ఉప్పల సతీష్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ముంబైలో దొరికాడు. సతీష్‌ను హైదరాబాద్‌కు తీసుకురానున్నారు పోలీసులు.
కాగా, ఘరానా మోసగాడు సతీష్‌ను పట్టుకోవడం నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ప్రతి అంశంలోనూ టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి కోసం ఎస్‌ఐ నేతృత్వంలో బృందాన్నిపంపారు. అక్టోబర్ 23వ తేదీ రాత్రి సతీష్‌తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ వెంటనే వారి వద్ద ఉన్న దాదాపు ఎనిమిది సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిందితుల్ని పోలీసులు తమ వాహనంలోనే తరలిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వారి చేతికి అందనీయరు. టాస్‌్కఫోర్స్ ఎస్‌ఐ మాత్రం తన బృందం ఉన్న కారును వదిలి నిందితులతో కలిసి వాళ్ల కారు ఎక్కారు. ఫోన్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేశాడు. ఈ వాహనాన్ని నిందితుడి డ్రైవరే నడిపారు.
వీరిది ఎస్‌యూవీ వాహనం కాగా పోలీసులది పాత ఇన్నోవా. దీంతో ఈ రెండు వాహనాల మధ్య దూరం దాదాపు 40 కి.మీలకు చేరింది. షోలాపూర్‌లో నిందితులతో కలిసి భోజనం చేసిన ఎస్‌ఐ ఆ సమయంలోనూ తన బృందంతో మాట్లాడారు. వీరి వాహనం సదాశివపేట్ చేరడానికి రెండు గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంది. గత నెల 24వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సతీష్, ఎస్‌ఐ తదితరులు ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేట్‌లోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న నగరం నుంచి వచ్చిన కారులో ఎక్కిన నిందితులు కొల్హాపూర్ వైపు పారిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి ఎస్‌ఐ సమాచారం ఇచ్చారు. ఇలా ఉప్పల సతీష్ తప్పించుకుపోగా, తాజాగా మళ్లీ పోలీసులకు చిక్కాడు.


