వ్యాపారంలోకి అడుగిడుతున్న మహిళల సంఖ్య ఇది
పురుషుల్లో ఎనిమిది మందిలో ఒకరు బిజినెస్ ఎంట్రీ
స్త్రీల వ్యాపార వృద్ధిలో అడ్డంకిగా ఇంటి బాధ్యతలు
గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ మానిటర్ తాజా నివేదికలో వెల్లడి
అన్నింటా మేము అన్నట్టు వ్యాపారాల్లోనూ మహిళామణులు రాణిస్తున్నారు. పెట్టుబడి స్థాయి ఎంతదైనా తాము ప్రారంభించిన వ్యాపారాన్ని నిలబెట్టడమే కాదు.. ఆవిష్కరణల్లోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. చిన్న దుకాణమైనా, స్టార్టప్ అయినా.. కుటుంబ బాధ్యతలు, పెట్టుబడి కొరత రూపంలో నిరంతర అడ్డంకులను మహిళా వ్యాపారులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క దేశానికో ఈ సవాళ్లు పరిమితం కాలేదు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
51 దేశాల్లో సర్వే
బాబ్సన్ కాలేజ్, లండన్ బిజినెస్ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాల తీరుతెన్నులను అంచనా వేసేందుకు నిర్వహిస్తున్న పరిశోధన ప్రాజెక్టు అయిన ‘గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ మానిటర్ (జీఈఎం)’తాజాగా 2024/2025 ఉమెన్స్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. సర్వేలో భారత్, చైనా, యూఎస్, యూకే, జర్మనీ సహా 51 దేశాలకు చెందిన లక్షలాది మంది పాలుపంచుకున్నారు.
మహిళలు వ్యాపారం ప్రారంభించడంలో, కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న తీరును ఇందులో సమగ్రంగా వివరించింది. ప్రపంచ దేశాల జాతీయ ఆర్థిక విధానాలను ప్రభావితం చేయడానికి జీఈఎం డేటా ఉపయోగకరమైన సాధనంగా స్థానం సంపాదించింది. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశ్వసించే వనరుగా నిలిచింది.
ఉద్యోగ ప్రత్యామ్నాయంగా..
అనేక మంది మహిళా వ్యవస్థాపకులకు వ్యాపారం ఒక ఉద్యోగ ప్రత్యామ్నాయం. ఒకే వ్యక్తి నిర్వహించేలా వారు చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలను వ్యాపారం వైపు నడిపించడానికి గల కారణాల్లో.. ఉద్యోగ కొరత 71.1%, సంపదను పెంచుకోవడం 57.3%, ప్రత్యేకత చూపించుకోవడానికి 49.8%, వారసత్వ వ్యాపారం 31.5% కారణాలుగా చెప్పారు.
వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్న వ్యాపారాలను నడుపుతున్న చాలా మంది మహిళలు అధిక ఆదాయ దేశా లకు చెందినవారని నివేదిక తెలిపింది. వారు డిగ్రీలను కలిగి ఉండటంతోపాటు అధిక ఆదాయ కుటుంబాల నుంచి వచ్చారు. డిజిటల్ మాధ్యమాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. స్థిరత్వ లక్ష్యాలను చేరుకుంటారని నివేదిక వివరించింది.
కుటుంబానికే ప్రాధాన్యత..
2024లో ప్రపంచవ్యాప్తంగా 3.4% మంది మహిళలు వ్యాపారాన్ని మూసివేశారు. పురుషుల విషయంలో ఈ సంఖ్య 3.8% ఉంది. కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్ల వ్యాపారాన్ని మూసివేసినట్టు 21% మహిళలు, 14.3% మంది పురుషులు వెల్లడించారు. అంటే కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్ల వ్యాపారానికి దూరం అవుతున్న మహిళల సంఖ్య పురుషుల కంటే 47% ఎక్కువ.
వ్యాపారాన్ని కాపాడుకోవడం ఒకవైపు, గృహ బాధ్యతలు మరోవైపు.. ఈ రెండింటినీ సమతుల్యం చేయడంలో చాలా మంది మహిళలు సమస్యలను ఎదుర్కొంటున్నారని నివేదిక వెల్లడించింది. వ్యాపార రంగంలో మహిళల పురోగతి మందగించడానికి ప్రధాన అడ్డంకి ఏమిటంటే.. చాలా మంది మహిళలు స్టార్టప్‌లను ప్రారంభించి అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా వారి భుజాలపై పడటమే.
23వ స్థానంలో మనం..
ఒక ఆర్థిక వ్యవస్థలో 18–64 సంవత్సరాల వయసు గల జనాభాలో.. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నవారు లేదా కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన వారి (42 నెలలలోపు) సంఖ్య ఆధారంగా టోటల్ ఎర్లీ స్టేజ్ ఆంట్రప్రెన్యూరియల్ యాక్టివిటీ (టీఈఏ) రేట్‌ను ఇస్తారు. 10% టీఈఏ రేటుతో భారత్ 23వ స్థానంలో ఉంది. మన దేశంలో టీఈఏ రేట్ మహిళల్లో 10.3%, పురుషుల్లో 14% ఉంది. ఇక 32% రేటుతో తొలి స్థానంలో ఈక్వెడార్ నిలిచింది.
» పురుషులతో పోలిస్తే మహిళా పెట్టుబడిదారులు 2.5 రెట్లు ఎక్కువగా స్త్రీలు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
» అనధికారిక పెట్టుబడులలో మూడింట రెండు వంతులు పురుష వ్యాపారులకే వెళ్లాయి.
» పెట్టుబడిదారులు, పెట్టుబడి గ్రహీతలు.. ఈ రెండు విభాగాల్లోనూ మహిళల సంఖ్య తక్కువ.
» 2024లో ఎనిమిది మంది పురుషులలో ఒకరు, పది మంది స్త్రీలలో ఒకరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు.
» నూతన ఆవిష్కరణలను తెచ్చే స్టార్టప్స్‌లో 18 దేశాలలో మహిళా వ్యాపారులు పురుష వ్యాపారులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నారు.
» 19 దేశాలలో మహిళల స్టార్టప్ రేట్లు పెరిగాయి. జోర్డాన్, మొరాకోలో రేట్లు రెట్టింపు అయ్యాయి.


