సాక్షి, చిత్తూరు జిల్లా: బెంగళూరు ఏటీఎం వ్యాన్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏపీలోని కుప్పంలో తనిఖీలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు.. కూర్మానీపల్లెలో రూ. 7.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా నిందితులు నగదును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుస్తూ.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును మారుస్తున్న క్రమంలో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అధికారులమంటూ ఏటీఎం కరెన్సీ వ్యాన్ సిబ్బందిని నమ్మించి ఏకంగా రూ.7.5 కోట్ల కరెన్సీ కట్టలను దోచుకెళ్లిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం(నవంబర్ 19) మధ్యాహ్నం 12.24 గంటలకు జేపీ నగర్ హెచ్‌డీఎఫ్‌సీ కరెన్సీ చెస్ట్ నుంచి రూ.7.5 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను తీసుకుని వేర్వేరు ఏటీఎంలలో నింపేందుకు బయల్దేరిన సీఎంఎస్ ఇన్నో సిస్టమ్స్ వారి ఏటీఎం క్యాష్‌వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అశోకా పిల్లర్ వద్ద అడ్డగించారు.
ప్రభుత్వ స్టిక్టర్ అంటించి ఉన్న ఖరీదైన ఎస్‌యూవీ వాహనంలో దిగిన ఆ దొంగలు తాము ఆర్‌బీఐ ఉన్నతాధికారులమంటూ నమ్మబలికారు. డాక్యు మెంట్లను వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ కస్టోడియన్ అఫ్తాబ్, గన్‌మెన్ రాజన్న, తమ్మయ్యలనూ తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ వాహనాన్ని అనుసరించాలని ఏటీఎం క్యాష్ వాహన డ్రైవర్‌కు సూచించారు. డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పిస్టల్ చూపించి డ్రైవర్‌ను బెదిరించి కరెన్సీ కట్టలు తీసుకుని ఉడాయించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసును కర్ణాటక పోలీసులు ఇవాళ ఛేదించారు.


