యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్.. వేదిక ఏదైనా ఈ సామాజిక మాధ్యమాల్లో విహరిస్తున్నవారే ఎక్కువ. స్మార్ట్‌ఫోన్ యూజర్లు గంటల తరబడి వీడియోలను వీక్షిస్తున్నారు. దీంతో డిజిటల్ వీడియోలు భారత్‌లో అత్యంత ప్రధాన వినోద మాధ్యమంగా మారాయి. అయినప్పటికీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ముంచెత్తుతున్న ప్రకటనలు వీక్షకుల మదిలో నమోదు కాకపోవడం ఆసక్తికరం.
ఆర్‌కే స్వామి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్ (సీఎస్‌ఐఎం), హన్స రీసెర్చ్ గ్రూప్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. పది ప్రధాన నగరాల్లో ముఖాముఖి ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 3,000 మందికి పైగా ఆన్‌లైన్ కస్టమర్లు పాలుపంచుకున్నారు. వీరంతా కలిసి 600 పైచిలుకు బ్రాండ్ల పేర్లను వెల్లడించారు.
సగటున ఒక్కో యూజర్ 1.5 బ్రాండ్స్‌ను మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. పదకొండు బ్రాండ్స్ మాత్రమే 3 శాతం మందికి పైగా గుర్తున్నాయి. జెప్టో, జొమాటో, మీషో, నెస్‌కఫే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, బ్లింకిట్, కంట్రీ డిలైట్, రమ్మీ సర్కిల్, డ్రీమ్11 వీటిలో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ప్రధానంగా ఆన్‌లైన్ బ్రాండ్స్, గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు మాత్రమే బ్రాండ్స్ రీకాల్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
నాలుగింట మూడొంతులు..
వాట్సాప్‌లో వచ్చిన నాలుగు వీడియోలలో మూడింటిని యూజర్లు వీక్షించడమే కాదు వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేస్తున్నారు. సామాజిక భాగస్వామ్యం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉందనడానికి ఇది సూచిక అని నివేదిక తెలిపింది. వీక్షకులు ఎక్కువగా ఉండే ప్లాట్‌ఫామ్‌లలో కూడా వీడియో యాడ్స్‌ను మ్యూట్ చేయడం, దాటవేయడం (స్కిప్) వల్ల ప్రకటనల ప్రభావాన్ని గణనీయంగా దెబ్బ తీస్తున్నాయని వివరించింది. భారత్‌లో ఎక్కువగా ఉపయోగించే వీడియో ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌లో యూజర్లు అధిక సమయం గడిపినప్పటికీ ఈ వేదికపైనా బ్రాండ్ రీకాల్ (గుర్తు పెట్టుకోవడం) పేలవంగా ఉందని తెలిపింది.
⇒ 600 బాండ్స్‌లో ప్రతీ బ్రాండ్ రీకాల్ మార్క్ 1 శాతం లోపే ఉంది.
⇒ యూజర్లు రోజూ సగటున 2.17 గంటలపాటు వీడియోలను చూస్తున్నారు.
⇒ 93% మంది మొబైల్ ఫోన్‌లోనే వీడియో కంటెంట్‌ను వీక్షిస్తున్నారు.
⇒ యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రధాన ప్లాట్‌ఫామ్స్.
⇒ తమ మొబైల్ తెరపై వచ్చిన ప్రకటనలు స్కిప్ చేస్తున్నట్టు 78% మంది తెలిపారు.
⇒ యాడ్స్ అసంబద్ధంగా ఉంటున్నాయని 57% మంది వెల్లడించారు.
⇒ తప్పనిసరిగా చూడాల్సిన పరిస్థితి ఉంటే ప్రకటనలను మ్యూట్ చేస్తామని 50% మంది చెప్పారు.
⇒ ప్రకటనలను చూడటానికి అభ్యంతరం లేదని, రెండుసార్లు వీక్షించాల్సి వస్తే ఇష్టపడడం లేదని 8% మంది వెల్లడించారు.
పేర్లు చెప్పాలేక..
డిజిటల్ ప్రకటనల కోసం భారత్‌లో కంపెనీలు ఏటా రూ.22,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇంత భారీ స్థాయిలో వెచ్చిస్తున్నప్పటికీ బ్రాండ్స్ పేర్లు జనం మదిలో పెద్దగా లేకపోవడమేకాదు.. వాటితో తక్కువ మమేకం కావడం ప్రకటనదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంతో వీక్షకులు నిర్దిష్ట బ్రాండ్స్ పేర్లను చెప్పలేకపోయారు. బ్రాండ్ పేరుకు బదులుగా ‘మొబైల్ ప్రకటన’, ‘దుస్తుల ప్రకటన’అని వర్ణించారని నివేదిక తెలిపింది. యూజర్లు చెప్పిన చాలా బ్రాండ్స్ ఫుడ్ డెలివరీ, ఈృకామర్స్, కాఫీ, కిరాణా సామగ్రి వంటి విభాగాలకు చెందినవి. ప్రకటనల ప్రభావం కంటే రోజువారీ వినియోగం ఈ బ్రాండ్లకు గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి.
బ్రాండ్ రీకాల్: ఉత్పత్తులు, సేవల గురించి ఆలోచించేటప్పుడు ఎటువంటి క్లూ లేకుండా ఒక బ్రాండ్‌ను వెంటనే గుర్తు చేసుకోవడం, లేదా గుర్తించగల సామర్థ్యమే బ్రాండ్ రీకాల్. వినియోగదారు మదిలో ఒక బ్రాండ్ ఎంత బాగా పాతుకుపోయింది, కొనుగోలు నిర్ణయాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తోంది, ఏ మేరకు కస్టమర్ విశ్వాసాన్ని చూరగొన్నదీ తెలిపే కొలమానం ఇది. ఉదాహరణకు సాఫ్ట్ డ్రింక్ అనగానే కోకాృకోలా, పెప్సీ గుర్తుకొస్తాయి. అధిక బ్రాండ్ రీకాల్ కలిగి ఉండడమే ఇందుకు కారణం.


