రేవంత్‌ ముఠా హవా.. 9300 ఎకరాల కుంభకోణం: కేటీఆర్‌ | BRS KTR Press Meet Full Details Over Land Scam | Sakshi
Sakshi News home page

రేవంత్‌ ముఠా హవా.. 9300 ఎకరాల కుంభకోణం: కేటీఆర్‌

Nov 21 2025 12:28 PM | Updated on Nov 21 2025 1:05 PM

 BRS KTR Press Meet Full Details Over Land Scam

సాక్షి, తెలంగాణభవన్‌: తెలంగాణలో భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. నాలుగు లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ ముఠా ప్రయత్నిస్తుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఫార్ములా ఈ కారు రేసు కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు అంటూ కామెంట్స్‌ చేశారు. 

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో భూములు ఎక్కడున్నా రేవంత్‌ ముఠా అక్కడ వాలిపోతోంది. ఎంతో విలువైన భూములపై రేవంత్‌ కుటుంబ సభ్యుల కన్ను పడింది. బాలానగర్‌ పరిసరాల్లో సుమారు 9300 ఎకరాల భూకుంభకోణం జరుగుతోంది. బాలానగర్‌, కాటేదాన్‌, జీడిమెట్లతో తన వాళ్లకు రేవంత్‌ భూములిచ్చారు. నాలుగు లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోంది. జపాన్‌లో ఉన్నప్పుడు కూడా ఆ భూమికి సంబంధించిన ఫైల్‌పై రేవంత్‌ ఆదేశాలు ఇచ్చారు.

కుంభకోణంలో బీజేపీ..
రేవంత్ భూకుంభకోణంపై బీజేపీ నేతలు స్పందించాలి. బీజేపీ కూడా కుంభకోణంలో భాగం. అందుకే స్పందించడం లేదు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతోంది. కుంభకోణంపై పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తాం. రేవంత్ ప్రభుత్వంతో పాటు.. భూములు పొందినవారు ఇబ్బందులు పడతారు. పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పడొద్దు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పేటీఎంగా మార్చుకున్నారు. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతాం.

ప్రతీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో అతిపెద్ద భూకుంభకోణానికి తెరలేపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 2022లో భూముల రెగ్యులేషన్‌కు చట్టం తెచ్చాం. భూములకు వంద శాతం ఫీజు కట్టేలా నిబంధన చేర్చాం. వేరే వాళ్లకు అమ్ముకుంటే రెండు వందల శాతం చెల్లించాలి. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోకుండానే భూ కేటాయింపులు చేసింది. 30 శాతం కడితే రెగ్యులర్‌ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చారు అని ఆరోపణలు చేశారు. 

నేను ఏ తప్పు చేయలేదు..
అలాగే, ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో గవర్నర్ ప్రాసిక్యూషన్‌కి అనుమతిపై కేటీఆర్‌ స్పందిస్తూ..‘చట్టం తన పని తాను చేసుకుంటుంది. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు. ఫార్ములా కారు రేసింగ్‌లో నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టివ్ టెస్టుకు నేను రెడీ. కారు రేసులో ఏమీ లేదని రేవంత్‌కు కూడా తెలుసు. కడియం శ్రీహరిని కాపాడి దానం నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా GHMC ఎన్నికలు వస్తాయి. తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి. దానం కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయాడు. అనర్హత వేటు పడితే.. ఇజ్జత్ పోతుందని.. రాజీనామా చేపిస్తున్నారు. సాంకేతిక సాకులు చూపి.. కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలొస్తాయి. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుంది. మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం.. అన్ని లెక్కలు తెలుస్తాం’ అని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement