మణిపాల్ ఆస్పత్రి వైద్యుల ఘనత
గురుగ్రామ్‌లో ఘటన
న్యూఢిల్లీ: ప్రమాదంలో ఎడమ మోచేతి తెగిపోయి రక్తమోడుతున్న ఒక యువకుడికి మళ్లీ మోచేయిని అతికించి వైద్యులు అతనికి ఒకరంగా నూతన జీవితాన్ని ప్రసాదించారు. గురుగ్రామ్‌లోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఈ ఘనత సాధించారు. దాదాపు 9 గంటలపాటు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి 28 ఏళ్ల యువకుడి మోచేయిని విజయవంతంగా అతికించారు. అరుదైన కాస్మొటిక్ శస్త్రచికిత్స చేసిన తీరును ఆస్పత్రి శనివారం ఒక ప్రకటనలో వివరించింది.
‘‘ప్రమాదవశాత్తు అతని ఎడమ మోచేయి తెగిపడింది. అయితే వెంటనే తెగిన మోచేతిని సమీప ఆస్పత్రిలో భద్రపరిచారు. రక్తమోడుతున్న అతడిని మా ఆస్పత్రికి హుటాహుటిన తీసుకొచ్చారు. చేతిని సైతం వెంటనే తరలించారు. అప్పటికే అతడు చాలా రక్తం కోల్పోవడంతో ఆరోగ్య పరిస్థితి దిగజారింది. వెంటనే శస్త్రచికిత్స వైద్యులు శరీరం తెగిన చోట శుభ్రంచేసి విరిగిన ఎముకలను సరిచేశారు. అక్కడ చిధ్రమైన కండను సైతం పునరుద్ధరించారు.
ఎముక, కండ సమీపంలోని స్నాయువులను సరిచేశారు. సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలిస్తూ జాగ్రత్తగా రక్తనాళాలను తెగిపోయిన మోచేయిలోని రక్తనాళాలతో అనుసంధానంచేశారు. దీంతో శరీరం నుంచి మళ్లీ ఆ చేతిలోకి రక్తసరఫరా మొదలైంది. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఎనిమిది, తొమ్మిది గంటలు పట్టింది. ప్లాస్టిక్, కాస్మొటిక్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఆశిష్ ధింగ్రా సారథ్యంలోని బృందం సంక్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తిచేసింది’’ అని ఆస్పత్రి తెలిపింది.
‘‘ మొత్తం తెగిపోయిన శరీరభాగాన్ని అతికించడం చాలా చాలా కష్టం. అయితే తెగిపోయిన భాగాన్ని తడితగలకుండా, స్టెరిలైజ్‌చేసి భద్రపరిచి ఆస్పత్రికి తీసుకొస్తే అతికించడం సాధ్యమే. ఆలస్యమయ్యే కొద్దీ ఆపరేషన్ విజయావకాశాలు తగ్గుతూపోతాయి. మారుమూల ప్రాంతంలో ఈ ఘటన జరిగినా వెంటనే పేషెంట్, చుట్టుపక్కల వాళ్లు స్పందించి, అప్రమత్తంగా వ్యవహరించడంతో రీప్లాంటేషన్ సర్జరీ విజయవంతమైంది’’ అని వైద్యుడు
ధింగ్రా వ్యాఖ్యానించారు.


