మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజం
హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీగా ‘హిల్ట్ పి’
రాష్ట్ర బడ్జెట్‌తో పోలిస్తే రెండు రెట్ల పెద్ద కుంభకోణం ఇది
రెండు నెలల్లో రూ.5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కారు స్కెచ్
పాలసీ బయటకు రాకముందే సీఎం సోదరులు కమీషన్లు, వాటాలు మాట్లాడుకున్నారు
ఆ ఒప్పందాల వివరాలు త్వరలో బయట పెడతాం
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవాడల్లోని సుమారు పది వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం పప్పు బెల్లాలకు అమ్ముకునే కుట్రకు తెరలేపిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పి).. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీగా మారుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూముల అడ్డగోలు అమ్మకం మీద దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
ఎకరాలు, గుంటలు, గజాలను కూడా వదిలిపెట్టకుండా అడ్డగోలుగా భూముల అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో భూముల అమ్మకంపై ప్రవచనాలు వల్లించిన రేవంత్.. ఇప్పుడు భవిష్యత్తు అవసరాలకు కూడా మిగలకుండా అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. ‘రాష్ట్ర బడ్జెట్‌తో పోలిస్తే ప్రస్తుత కుంభకోణం రెండు రెట్లు పెద్దది. రెండు నెలల్లో రూ.5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కారు స్కెచ్ వేసింది..’అని ఆరోపించారు.
రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు ‘హిల్ట్ పి’తో ప్రభుత్వం తెరలేపిన విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు కూడా అంగీకరించాడని పేర్కొన్నారు. కొత్త పాలసీపై ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని సవాల్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. తాను లేవనెత్తే ఎనిమిది అంశాలపై ప్రభుత్వం సూటిగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఆర్‌ఓ రేటునే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు?
‘సబ్ రిజి్రస్టార్ కార్యాలయం (ఎస్‌ఆర్‌ఓ) ధరలతో పోలిస్తే టీజీఐఐసీ నిర్దేశించిన భూముల ధరలు ఎక్కువ. కానీ రేవంత్ ప్రభుత్వం ఎస్‌ఆర్‌ఓ ధరల్లో కేవలం 30 శాతం రేటు చెల్లించే వారికి భూములు కట్టబెడుతోంది. ఎస్‌ఆర్‌ఓ రేటునే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? హైదరాబాద్‌లో తక్కువగా ఉన్న ఎస్‌ఆర్‌ఓ ధరలు సవరిస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం, సవరణ చేయకముందే ఎవరి మేలు కోసం హడావుడిగా ‘హిల్ట్ పి’అమలు చేస్తోంది.
రూ.లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు రాకుండా ఎందుకు నష్టం చేస్తున్నారు? లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) విషయంలో బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేసి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్.. పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లపై ఎస్‌ఆర్‌ఓపై అదనంగా 60 నుంచి 80 శాతం వసూలు చేసింది. అదే ‘హిల్ట్ పి’అమలుతో ల్యాండ్ కన్వర్షన్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ తదితరాల రూపంలో హెచ్‌ఎండీఏకు రూ.13,500 కోట్లు రాకుండా రేవంత్ ప్రభుత్వం చేస్తోంది.
ఓఆర్‌ఆర్ లోపల మాత్రమే కాకుండా ఓఆర్‌ఆర్ చుట్టు పక్కల భూములు కూడా కొల్లగొట్టేలా పాలసీని తయారు చేసింది నిజం కాదా? ఎస్‌ఆర్‌ఓ ధరల్లో 30 శాతం వసూలు ద్వారా వచ్చే మొత్తంతో కొత్త పారిశ్రామిక వాడలు, క్లస్టర్లు అభివృద్ధి చేస్తారా? లేక బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారా? అనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి..’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఎనుముల సోదరుల జేబులు నింపేందుకే..
‘ఎనుముల సోదరుల జేబులు నింపేందుకే సీఎం ‘హిల్ట్ పి’తెచ్చారు. ఆరు నెలల క్రితమే పాలసీని రూపొందించి అది బహిర్గతం కాకమునుపే రేవంత్‌రెడ్డి సోదరులు అగ్రిమెంట్లు చేసుకుని కమీషన్లు, వాటాలు కూడా మాట్లాడుకున్నారు. విలువైన భూములు సగానికి సగం అనుముల బ్రదర్స్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆ ఒప్పందాల వివరాలు త్వరలో బయట పెడతాం.
గతంలో ఇలాంటి ప్రతిపాదన మేం తిరస్కరించాం. మంత్రి శ్రీధర్‌బాబు భూ కుంభకోణం పరిధిని తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని రూ.5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారో ఆయన చెప్పాలి. తిట్టినా, కేసులు పెట్టినా రేవంత్‌ను వదిలేది లేదు..’అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.


