ఖాండ్వా (మధ్యప్రదేశ్): అదొక ప్రభుత్వ ఆసుపత్రి. తెల్లటి దుప్పట్లు పరిచిన మంచాలు.. పైన ఫ్యాన్ గాలి.. అక్కడ పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నది ఏ రోగో అనుకుంటే పొరపాటే. అక్కడ దర్జాగా కాలు మీద కాలు (క్షమించాలి.. కాలు మీద తోక) వేసుకుని సేదదీరుతున్నది సాక్షాత్తూ వీధి కుక్కలు.
కుక్కలకు వీఐపీ ‘ట్రీట్‌మెంటా!’
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలోని కిల్లౌడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కనిపించిన ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. రోగులకు దక్కాల్సిన పడకల మీద.. వీధి కుక్కలు యథేచ్ఛగా విహరిస్తూ, నిద్రపోతున్న వీడియో బయటకు రావడంతో ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మనిషికి మంచం దొరకదు కానీ, కుక్కలకు మాత్రం వీఐపీ ట్రీట్‌మెంటా?’.. అంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
చిరుద్యోగులపై వేటు
వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులుగా చేస్తూ.. అక్కడి స్వీపర్‌ను తక్షణం ఉద్యోగం నుండి తొలగించారు. విధుల్లో ఉన్న నర్సుకు వారం రోజుల జీతం కోత విధించారు. ‘బాధ్యులెవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు’.. అని జిల్లా కలెక్టర్ రిషబ్ గుప్తా హెచ్చరించారు. మొత్తానికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల.. కుక్కలు పడకలు ఎక్కాయి, ఉద్యోగులు రోడ్డున పడ్డారు!


